Harish Rao | యువత ముందుకు వచ్చి హాస్టళ్లను దత్తత తీసుకొని పిల్లలకు సేవ చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. పిల్లలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్టే.. మానవ సేవయే మాధవ సేవ అని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నాసరపుర కేంద్రంలోని అర్బన్ రెసిడెన్సియల్ బ్రిడ్జి స్కూల్లోని విద్యార్థులకు స్వెట్లర్లు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. డిసెంబర్ 31 దావత్లను బంద్ చేసి.. ఆ డబ్బుతో హాస్టళ్లను దత్తత తీసుకోవాలని రాష్ట్రంలోని యూత్, యువజన సంఘాలకు పిలుపునిచ్చారు.
చలికాలంలో హాస్టల్లో వేడి నీళ్లు రాక, ప్రభుత్వం దుప్పట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. గత 4 నెలల నుంచి మెస్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ పెట్టి రాష్ట్రంలో ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేదని శాసన సభ సాక్షి గా చెప్పారని ప్రస్తావించారు. ఇదేనా గ్రీన్ ఛాలెంజ్ అని ప్రశ్నించారు. జీతం అగొచ్చు కానీ మెస్ బిల్లులు మాత్రం ఆగవు అన్న సీఎం మాట ఏమైందని నిలదీశారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదని విమర్శించారు.
రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పరిపాలన మీద పట్టు కోల్పోయారని.. ఈ ప్రభుత్వం ఫెయిల్ అనిపిస్తుందని చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటలు అమలు కాకపోవడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. మహాలక్ష్మి, తులం బంగారం ఎటు పోయాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాటలు అధికారులు వినడం లేదా లేక ముఖ్యమంత్రి ఉత్త మాటలు చెప్పానని అధికారులకు చెబుతున్నారా అని సందేహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అంటే అధికారులకు భయం లేదా విలువ లేదా.. గౌరవం లేదా అని నిలదీశారు.
తక్షణమే అన్నిచోట్ల మెస్ చార్జీలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకొని ఎందుకు రివ్యూ చేయడం లేదని నిలదీశారు. ఢిల్లీ పైసలు ఇచ్చినా గల్లీ విడుదల చేయడం లేదని విమర్శించారు. రూ.1300కి పెంచిన మెస్ ఛార్జిలు ఇప్పటికీ అమలు కాలేదని తెలిపారు. అర్బన్ రెసిడెన్షియల్లో రూ.1,050 మెస్ ఛార్జిలు మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. 1 నుంచి 7 తరగతి వరకు 1300, ఎనిమిదో తరగతికి రూ.1500 మెస్ ఛార్జిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాస్మోటిక్ ఛార్జిలు ఇంకా 100 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని.. వాటిని150 రూపాయలకు పెంచి ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులకు దూరంగా రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న విద్యార్థులపై ప్రభుత్వం మరింత బాధ్యతగా ఉండాలని హరీశ్‌రావు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయంలో కూడా మాట నిలుపుకోలేదని హరీశ్‌రావు విమర్శించారు. ఏ విషయంలోనూ చెప్పిన మాటకు క్షేత్రస్థాయిలో పొంతన లేదని అన్నారు. అసెంబ్లీ లో చెప్పినట్లుగా తక్షణమే మెస్ బిల్లులు, కాస్మోటిక్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.