Harish Rao | మూసీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. భూసేకరణ చట్టం 2013ను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని కేంద్రానికి పచ్చి అబద్ధం చెప్పారని విమర్శించారు. హైడ్రా కూల్చిన ఇండ్లకు పరిహారం ఎలా చెల్లిస్తారు.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై వాస్తవాలను దాచిపెడుతుందని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో గురువారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌ను రేవంత్ సర్కార్ తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు అని విమర్శించారు. రేవంత్ సర్కార్ కేంద్రానికి చెప్పిందొకటి.. ఇక్కడ చేస్తున్నది మరొకటి అని మండిపడ్డారు.
నిర్వాసితులను ఆదుకోవడానికి 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టం చేశారని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రాలు ఇంతకంటే ఎక్కువ సహాయం చేయాలని అనుకుంటే సొంతంగా చట్టాలు చేసుకోవచ్చని కేంద్రం తెలిపిందని గుర్తుచేశారు. కేసీఆర్ కూడా నిర్వాసిత కుటుంబం నుంచి రావడంతో వారి గురించి ఆయన ఆలోచన చేసి మెరుగైన చట్టాన్ని అమలు చేశారని చెప్పారు. ఈ క్రమంలోనే కేసీఆర్ సర్కార్ 2014లో భూసేకరణ చట్టం తీసుకొచ్చిందని తెలిపారు. నిర్వాసితులకు 121 గజాల స్థలంలో ఐఏవై ఇల్లు కట్టించాలని 2013 చట్టం చెబుతుంటే.. కేసీఆర్ 250 గజాల స్థలం, డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చేలా చట్టం చేసిందని పేర్కొన్నారు. నిర్వాసితులకు కేసీఆర్ డబుల్ బెనిఫిట్ కల్పించారని చెప్పారు. ఎలాంటి భూమి అయినా సరే నిర్వాసితులకు సమానమైన హక్కులు కల్పించారని తెలిపారు. కానీ ఇప్పుడు మూసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తుందని విమర్వించారు.
నష్టపోతున్న బాధితులను నిర్ధారించడానికి క్షేత్ర స్థాయిలో సర్వే చేయాలని సూచించారు. 60 రోజుల సమయం ఇస్తూ ప్రముఖ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని తెలిపారు. ఆ తర్వాత మరో 30 రోజుల సమయం ఇవ్వాలన్నారు. వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని పరిష్కరించాలని తెలిపారు. అప్పుడు ప్రక్రియ ప్రారంభించాలని తెలిపారు. కానీ రేవంత్ సర్కార్ ఇవేమీ పాటించలేదని మండిపడ్డారు. ఇక్కడ నోటీసులు లేవు, డీపీఆర్ లేదు, ఎన్యుమరేషన్ లేదని తెలిపారు. ఇవేవీ లేకుండానే ఇండ్లు కూలగొట్టి, కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఇచ్చారని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులు అత్యంత పేదలు అని హరీశ్‌రావు తెలిపారు. మూసీలో ఇండ్లు కూల్చేసి, బాధితులను డబుల్ బెడ్రూం ఇండ్లలో వేసిందని అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ పాలమూరు ఎత్తిపోతలలోగానీ, సీతారామ ప్రాజెక్టులో గానీ అనేక ప్రాజెక్టుల్లో తాము తీసుకొచ్చిన 2014 భూసేకరణ చట్టం అమలు చేశామని హరీశ్‌రావు తెలిపారు. ఏ ఇల్లు అయినా ఆ ఇంటికి ఆర్అండ్బి, పంచాయతీరాజ్ అధికారులు వెళ్లి పాత ఇంటికి ఎంత విలువ ఉంటుందో అంచనా వేస్తారని.. దానికి రెండింతల డబ్బును యజమానికి ఇస్తారని తెలిపారు. 2014 చట్టం ప్రకారం ఇంట్లో పెళ్లయిన ప్రతి ఒక్కరినీ కుటుంబంగా గుర్తించాలని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఏడున్నర లక్షలు పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. నిర్వాసితులకు అన్ని సౌకర్యాలతో కాలనీ నిర్మించి ఇవ్వాలని చెప్పారు. పెళ్లికాని 18 ఏండ్లు నిండిన వాళ్లకు రూ.5 లక్షలు, పెళ్లయిన వారికి 250 గజాల స్థలం ఇవ్వాలని తెలిపారు. అమ్ముకోవడానికి హక్కులతో కూడిన ఇల్లు నిర్మించి ఇవ్వాలని సూచించారు. కానీ కేసీఆర్ కట్టించిన ఇండ్లను మూసీ బాధితులకు కేవలం అసైన్డ్ పేపర్ ఇచ్చి పంపించారని తెలిపారు. అంటే వారికి ఆ ఇండ్ల మీద ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టం చేశారు.
ప్రజలు, పార్లమెంటును సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డే అని తెలిపారు. సంబంధిత శాఖ మంత్రి సంతకంతోనే పార్లమెంటుకు సమాధానం వెళ్తుందని పేర్కొన్నారు. అంటే ఆయనకు తెలిసి కూడా కేంద్రానికి తప్పుడు సమాచారం అందించారని మండిపడ్డారు. కొత్తగా ఇండ్లను కూల్చబోమని అంటున్నారని.. మరి కూల్చిన వాటి సంగతేంటని ప్రశ్నించారు. పసిపిల్లలపై కనికరం లేకుండా, కాళ్లపై వేడుకుంటున్నా ఆగలేదని గుర్తుచేశారు. వర్షం పడుతుంటే నడిరోడ్డుపై పడేశారని మండిపడ్డారు. వాళ్లు పడిన బాధ, క్షోభకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. హైడ్రా కూల్చిన ఇండ్లకు పరిహారం ఎట్ల చెల్లిస్తారని ప్రశ్నించారు. పరిహారం ఇచ్చేవరకు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వదిలిపెట్టదని స్పష్టం చేశారు.