Harish Rao | మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ గురుకులానికి చెందిన నలుగురు విద్యార్థినులు విద్యుదాఘాతానికి గురవ్వడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. విద్యార్థినులు కరెంట్ షాక్ తగిలి గాయపడటం దురదృష్టకరమని అన్నారు.
సిబ్బంది నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నదని.. ప్రభుత్వ పట్టింపు లేనితనం పిల్లల ప్రాణాల మీదకు తీసుకొస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు, ఫుడ్ పాయిజన్ కేసులు సర్వసాధారణమయ్యాయని హరీశ్‌రావు అన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో కరెంట్ షాకులు చేరాయని మండిపడ్డారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని అన్నారు. గాడి తప్పిన గురుకులాలను బాగు చేయాలని డిమాండ్ చేశారు.