Harish Rao | గ్రూప్-1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం దావా నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు స్పందించారు. రాకేశ్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గ్రూప్-1 అభ్యర్థుల తరఫున అన్యాయాన్ని ప్రశ్నిస్తే పరువు నష్టం దావా వేస్తారా అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అంటూనే నియంతృత్వ పాలనను కొనసాగిస్తారా? క్రిమినల్ కేసులు అంటూ బెదిరిస్తారా? అని నిలదీశారు.
ఆరోపణలు వస్తే, వాస్తవాలు బయట పెట్టాల్సింది పోయి, నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమని హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని, ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భయపడబోరని హెచ్చరించారు. న్యాయపరంగా ఇలాంటి అక్రమ కేసులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
టీజీపీఎస్సీ పరువు నష్టం దావా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి స్పందించారు. జైల్లో బంధిస్తే జైలు గోడల మీద నా రాజు తరతరాల బూజు అని ధిక్కార స్వరాన్ని వినిపించిన కవి దాశరథి పుట్టిన ఓరుగల్లు నేల పై పుట్టిన బిడ్డనని తెలిపారు. ఇలాంటి నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్లీ మళ్లీ చేస్తానని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అవకతవలపై ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీని సహేతుకంగా ప్రశ్నించినందుకు తనపై పరువునష్టం దావా వేశారని ఏనుగుల రాకేశ్ రెడ్డి తెలిపారు. ప్రశ్నిస్తేనే పరువు పోతే మరి, మీవల్ల జరిగిన అవకతవకల వల్ల జీవితాలను కోల్పోతున్న నిరుద్యోగులు ఏం చేయాలని ప్రశ్నించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో ఇదే టీఎస్పీఎస్సీపై రోడ్డెక్కి మరీ ఎన్నో విమర్శలు చేశారని గుర్తుచేశారు. మరి అప్పుడెందుకు నోటీసులు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీకి, నాయకత్వానికి కేసులు కొత్త కాదని, పోరాటం కొత్త కాదని తెలిపారు. ఆ స్ఫూర్తితోనే విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన కొట్లాడతామని పేర్కొన్నారు. మీ ఇజ్జత్ దావాకు ఇగురంగానే త్వరలోనే సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.