Harish Rao | మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు తమ పిల్లలను ప్రత్యేక శ్రద్ద పెట్టి చదివించాలని తల్లిదండ్రులకు మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో హరీశ్‌రావు శుక్రవారం నాడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నేను రాసిన ఉత్తరం అందిందా.. మీ బిడ్డ బాగా చదువుతుందా అని ఆరా తీశారు. పిల్లల్ని పొద్దుగాళ్ల 5 గంటలకు లేపి చదివించాలని సూచించారు.
పదో తరగతి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు అని విద్యార్థుల తల్లిదండ్రులతో హరీశ్‌రావు తెలిపారు. మరి కొద్ది రోజుల్లోనే మీ పిల్లలు పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారని.. వారి చదువులో ఇది అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. ఇది మంచి మార్కులతో గట్టెక్కితేనే ఉన్నత చదువుల దిశగా ముందడుగు వేసే అవకాశం ఉంటుందని చెప్పారు. లేదంటే మీరు ఇన్నాళ్లు పడిన కష్టానికి, మీ పిల్లల చదువుకు ఎలాంటి అర్థం ఉండదన్నారు. మీ పిల్లలు తమ చదువుల్లో విజయం సాధించాక మీరు ఇచ్చే అభినందన కన్నా మీ పిల్లలు పరీక్షలు రాసే ముందు మీరు తీసుకొనే ప్రత్యేక శ్రద్ధ ఎంతో ముఖ్యమని చెప్పారు.. అందుకే వార్షిక పరీక్షలు ముగిసేదాకా పిల్లలపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలన్నారు. విందులు, వినోదాలు, ఫంక్షన్లు, సినిమాలు, టీవీల జోలికి వెళ్లకుండా చూడాలని చెప్పారు. మీ ఇంటికి సంబంధించిన పనులను, వ్యవసాయ పనులు కూడా చెప్పవద్దని కోరారు.
✨ నేను వ్రాసిన ఉత్తరం అందిందా…
✨ మీ బిడ్డ బాగా చదువుతుండా…
✨ మీ పిల్లల్ని పొద్దుగాల్లా 5 గంటలకు లేపి చదివించాలి…
✨ సిద్దిపేట విద్యార్థులు పది నుండే ఉత్తమ ప్రతిభ చూపాలన్నదే నా తాపత్రయం…
✨ అన్నింటిలో ఆదర్శంగా ఉన్న సిద్దిపేట పదిలో ఫస్ట్ రావాలి.. అందులో మీ బిడ్డ… pic.twitter.com/o0BI0ZYWol
— Office of Harish Rao (@HarishRaoOffice) January 10, 2025
ఈ పోటీ ప్రపంచంలో సాదాసీదాగా కాకుండా ప్రతిభను చాటితేనే మంచి అవకాశాలు వస్తున్నాయని హరీశ్‌రావు అన్నారు. గత నాలుగేళ్లుగా మన సిద్దిపేట నియోజకవర్గంలో చదివిన పదో తరగతి విద్యార్థులంతా అత్యధిక మార్కులు సాధిస్తున్నారని తెలిపారు. నూటికి నూరు శాతం పాసవుతున్నారని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలోనూ 169 మంది సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థులు గత ఏడాది సీట్లు సాధించడం గర్వకారణమని అన్నారు. ఉచిత ఇంజనీరింగ్ విద్యతోపాటు మంచి ఉద్యోగాలను దక్కించుకుంటున్నారని తెలిపారు. మీ పిల్లలు మంచి మార్కులతో పాస్ కావలనేదే తన ఆకాంక్ష .. తపన అని పేర్కొన్నారు.
తన వంతుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులతో పాటు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నానని హరీశ్‌రావు తెలిపారు. జిల్లా విద్యాధికారి నుంచి మీ పిల్లలకు చదువు చెప్పే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కూడా సమీక్షలు నిర్వహిస్తానని చెప్పారు. వారి స్కూళ్లలో సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఒక్క మార్కు కూడా తగ్గకుండా డిజిటల్ కంటెంట్ ద్వారా ప్రతీ సబ్జెక్టుపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిన మన సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో కూడా ఆదర్శంగా నిలవాలనేదే తన తాపత్రయమని తెలిపారు. ప్రజాప్రతినిధిగా, మీ కుటుంబంలో ఒకడిగా తన వంతు ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. మీరు కూడా మీ పిల్లలను బాగా చదివించండని సూచించారు. చదువుతోపాటు చేతిరాత చక్కగా ఉండేలా చూడాలన్నారు. ఇక మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని సూచించారు.