Harish Rao : కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహిస్తుంటే.. మరోవైపు ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంది? అని ఆయన ప్రశ్నించారు. ఒకవైపు అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు.. మరోవైపు బూటకపు ఎన్ కౌంటర్లు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని అన్నారు.
అన్ని వర్గాలను మోసం చేసి ఆరు గ్యారెంటీలను అటకెక్కించారని హరీష్రావు ఆరోపించారు. ఏడో గ్యారెంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజయవంతంగా తూట్లు పొడిచారని ఆయన ఎద్దేవా చేశారు. బూటకపు వాగ్ధానాలు, బూటకపు ఎన్కౌంటర్లు అంటూ మండిపడ్డారు. కాగా ములుగు జిల్లాలో ఇవాళ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ను నిర్వహించాయి. ఈ ఘటనలో ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న (35) తోపాటు అతని దళ సభ్యులు మృతిచెందారు. మృతుల్లో ఏటూరు నాగారం మహదేశ్పూర్ కార్యదర్శి ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు (43), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22), ముస్సకి జమున (23), జైసింగ్ (25), కిశోర్ (22), కామేశ్ (23) ఉన్నారు.
ఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిల్స్, పెద్ద మొత్తం ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 14 ఏండ్ల తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్ కావడం విశేషం.