Harish Rao | పదిహేనేండ్లుగా జన జీవన స్రవంతిలో ఉంటున్న సింగరేణి ఉద్యమ నాయకుడు, రచయిత మహ్మద్ హుస్సేన్ అలియాస్ రమాకాంత్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని మానవ హక్కులు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. తక్షణమే డీజీపీ ఈ వ్యవహారంపై స్పందించి హుస్సేన్ ఆచూకీపై ప్రకటన చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత టీ హరీశ్ రావు డిమాండ్ చేశారు. ‘ ప్రజా పాలన అని చెప్పుకుంటూ అక్రమ నిర్బంధాలు ,అరెస్టులు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదు. హుస్సేన్ ప్రాణాలకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి‘ అని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు.
జమ్మికుంటలోని పాత మార్కెట్ వద్ద గల తన సొంతింట్లో ఉన్న హుస్సేన్ అలియాస్ రామాకాంత్ ను సోమవారం తెల్లవారుజామున ఆరు గంటలకు పోలీసులు అరెస్ట్ వారంట్ లేకుండా అరెస్ట్ చేశారని మానవ హక్కుల వేదిక ఆరోపించింది. తాము మఫ్టీలో వచ్చిన పోలీసులం అని చెప్పడం తప్ప, ఎక్కడి నుంచి వచ్చారో, ఎందుకు వచ్చారో, ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పలేదని పేర్కొంది. స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా సమాచారం లేదని, బంధు మిత్రులు రకరకాల ప్రయత్నాలు చేస్తే కరీంనగర్ పోలీసులని, బెల్లంపల్లి పోలీసులని అనధికారిక సమాచారం చెప్పారే తప్ప అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించింది.