హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు రోజులు శాసనసభను నడిపిన తీరు, శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పిన అబ్ధాలను హరీశ్‌రావు ఎండగట్టారు. కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీ సాక్షిగా ఏవిధంగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నదో వివరించారు.
హరీశ్‌రావు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘నిన్న శాసనసభలో కాంగ్రెస్ పార్టీ తన ద్రోహాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కట్టుకథలను, రేవంత్ రెడ్డి పిట్ట కథలను చెప్పే ప్రయత్నం చేశారు. పూర్తిగా అబద్ధాలు చెప్పారు. తెలంగాణకు బీఆర్ఎస్ ఏదో అన్యాయం చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని, మోసాన్ని సరిదిద్ది తెలంగాణకు శాశ్వత నీటి హక్కులు పొందే విధంగా ప్రాజెక్టులు నిర్మించి ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది’ అని చెప్పారు.
‘కాంగ్రెస్ చేసిన ద్రోహాలను, తప్పులను, శనివారం వారు శాసనసభలో చెప్పిన అబద్ధాలను, తెలంగాణ నీటి హక్కులను కాపాడటానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చేసిన కృషిని నేను నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వెల్లడిస్తా. ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ రాజకీయాల కోసం కాదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నేను ఈ పీపీటీని మీ ముందు పెడుతున్నా. నేడు రాజకీయాలు అంటే పదవులు అన్నట్టుగా మారింది. కానీ మేం పదవులు కోసం పనిచేయట్లేదు. మాకు పదవులు శాశ్వతం కాదు, రాష్ట్రం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే శాశ్వతం’ అని హరీశ్‌రావు అన్నారు.