సీఎం రేవంత్ రెడ్డిపై యాదగిరిగుట్ట, భువనగిరి పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో యాదగిరిగుట్టు శ్రీ లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు వేశారని బీఆర్ఎస్ నేతలు గుర్తుచేశారు. లక్ష్మీనరసింహస్వామి మీద వాగ్ధానం చేసి మాట తప్పి.. భక్తుల మనోభావాలు, మత విశ్వాసాలను దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం దేవుడి పేరుతో అబద్ధాలు చెప్పారని.. తద్వారా లక్షలాది మంది భక్తుల విశ్వాసం ప్రభావితమైందని బీఆర్ఎస్ నేతలు అన్నారు. అందుకే మతపరమైన మనోభావాలు దెబ్బతీసినందుకు రైవంతత్ రెడ్డిపై BNS -2023 సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు కర్రె వెంకటయ్య ఫిర్యాదు చేశారు. అలాగే భువనగిరి పీఎస్లో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఏవీ కిరణ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు ఫిర్యాదు చేశారు.