హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీజేపీ చెప్పినట్టే వింటున్నారని బీఆర్ఎస్ నేత గట్టు రామచందర్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డిది, ప్రధాని మోదీది అన్యోన్యబంధమని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎలా భరిస్తున్నదోనని ఎద్దేవా చేశారు. పైన మేనేజ్, కింద బిజినెస్ అన్నట్టుగా సీఎం రేవంత్ వ్యవహారశైలి ఉన్నదని దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా 89 కేసులు ఉన్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం నిజంగా మన దౌర్భాగ్యమని విమర్శించారు. ముఖ్యమంత్రుల్లో రేవంత్‌రెడ్డి తర్వాత ఆయన గురువు చంద్రబాబు మీదనే ఎక్కువ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఉండి.. రాష్ట్రాన్ని కూడా దౌర్భాగ్యంలోకి నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్నివర్గాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు ఎందుకు ఓటు వేశామా? అని ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు.
హార్టికల్చర్, అగ్రికల్చర్‌కు తేడా తెలియని సీఎం
సీఎం రేవంత్‌రెడ్డికి.. హార్టికల్చర్‌కు, అగ్రికల్చర్‌కు కూడా తేడా తెలియదని గట్టు రామచందర్‌రావు విమర్శించారు. నిజంగా ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవారైతే ఎరువుల కొరత నిజమేనని ఒప్పుకునే వారు కదా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. రేపటిరోజున తెలంగాణలో అసలు రైతులే లేరని కూడా అంటారని ఎద్దేవా చేశారు. యూరియా ఇవ్వలేని సీఎంను రైతులు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. ఒకవైపు, యూరియా కోసం రైతులు అల్లాడుతుంటే.. మరోవైపు రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేవిధంగా పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి పాలన మీద కన్నా.. పక్కోడు తన సీటు ఎక్కడ గుంజుకుంటాడోనన్న భయం ఎక్కువగా ఉన్నదని విమర్శించారు. సోనియాగాంధీని నాడు బలిదేవత అని విమర్శించిన నోటితోనే నేడు దేవత అని కొనియాడుతున్నారని దుయ్యబట్టారు. కేవీపీ రామచందర్రావును పాతళాభైరవుడు అని తిట్టి.. ఇప్పుడు ఆయన ఒక చాణిక్యుడు అంటూ సంబోధించడం రేవంత్‌రెడ్డికే చెల్లుతుందని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేత బొమ్మర రామ్మూర్తి, బాపురెడ్డి పాల్గొన్నారు.