Gajjela Nagesh | హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవ్వాళ “చలో బస్ భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలంతా బస్ భవన్‌కు భారీగా తరలివచ్చారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్ వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బస్ భవన్ వైపు తరలివచ్చిన బీఆర్ఎస్ నేతలను అడ్డుకుంటూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు యత్నించిన బీఆర్ఎస్ నేతల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
బస్ భవన్ వద్దకు తరలివచ్చిన పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. బీఆర్ఎస్ నేతలు మన్నె క్రిశాంక్, గజ్జెల నగేశ్ పట్ల పోలీసులు దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించారు. గజ్జెల నగేశ్‌ను పోలీసులు బలవంతంగా పోలీసు వ్యాన్‌లో ఎక్కించారు. ఈ క్రమంలో నగేశ్ తలకు గాయమైంది. నడి నెత్తిన గాయం కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాడు. రక్తస్రావం జగరకుండా చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అనంతరం ఆస్పత్రి నుంచి నేరుగా నగేశ్ తెలంగాణ భవన్‌కు వెళ్లారు. అక్కడ తెలంగాణ భవన్ ఇంచార్జి రావుల చంద్రశేఖర్ రెడ్డి నగేశ్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక బస్ భవన్ వద్ద పోలీసులతో జరిగిన తోపులాటలో పలువురు నాయకులకు గాయాలయ్యాయి.