Gadari Kishore | బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాలు విసరడంపై మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ మండిపడ్డారు. సొల్లు లక్ష్మణ్, దున్నపోతు అని అన్నా కూడా స్పందించని వ్యక్తి.. ఇవాళ హరీశ్‌రావుకు సవాలు విసరడం సిగ్గుచేటు అని విమర్శించారు. రాహుల్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన చామల కిరణ్‌కుమార్ రెడ్డి కూడా నీతులు చెబుతున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో గ్యాదరి కిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కేబినెట్లో జరిగిన విషయాలపై మాత్రమే హరీశ్‌రావు మాట్లాడారని తెలిపారు. హరీశ్‌రావు కాలి గోటికి సరిపోని వాళ్లు కూడా సవాలు విసురుతున్నారని మండిపడ్డారు. అడ్లూరి లక్ష్మణ్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారని అన్నారు. మంత్రి అడ్లూరిని పట్టుకుని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ దున్నపోతు అన్నప్పటికీ స్పందించలేదని అన్నారు. పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై గుడికి వెళ్లి ప్రమాణం చేస్తావా అని సవాలు విసిరారు. గజినీ మహ్మద్లాగా ఐదుసార్లు పోటీ చేశాక అడ్లూరి లక్ష్మణ్ గెలిచి.. చివరకు మంత్రి అయ్యారని అన్నారు. నియోజకవర్గంలో అడ్లూరి లక్ష్మణ్‌ను సొల్లు లక్ష్మణ్ అని అంటారని.. నువ్వు చెప్పే సొల్లు మేం వినాలా అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు గన్మెన్లను ఎందుకు ఇస్తారని ఆమె అడిగారని తెలిపారు. డెక్కన్ సిమెంట్ కమీషన్ల కోసమే గొడవంతా జరిగిందని.. దీనిపై సీఎం పిలిచి సెటిల్మెంట్ చేయలేదా అని నిలదీశారు. రోహిన్ రెడ్డి, కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఇద్దరూ కలిసి తుపాకీ పెట్టి బెదిరించారని కొండా సురేఖ కుమార్తె చెప్పారని.. ఇంతకు ఆ తుపాకీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఇంత చేస్తున్న మీది దండుపాళ్యం బ్యాచ్ కాకపోతే ఇంకేటని నిలదీశారు.
చామల కిరణ్ కుమార్ రెడ్డి జడ్పీటీసీగా పోటీ చేస్తే వంకాయ గుర్తుపై 100 ఓట్లు వచ్చాయని గ్యాదరి కిశోర్ కుమార్ తెలిపారు. చామల ఒక చీటర్ అని.. రాహుల్ సంతకాన్ని ఫోర్జరీ చేస్తే.. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. వీళ్లంతా ఓటీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు అని.. ఒక్కసారి మాత్రమే గెలిచారని.. మళ్లీ గెలవరని పేర్కొన్నారు. ఇదంతా చూస్తుంటే ఆలీబాబా 40 మంది దొంగలు కాదు.. సీఎం .. ఆ నలుగురు దొంగల్లా అనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇకపై హరీశ్‌రావు మీద మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అని హెచ్చరించారు. మీరు ఒక్కటంటే మేం వంద అంటామని అన్నారు.