కోల్‌సిటీ, నవంబర్ 5: పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలో ఆపరేషన్ కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది. నిన్నటికి నిన్న గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేసిన పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు.. తాజాగా మంగళవారం ఉదయాన్నే అడ్డగుంటపల్లిలోని బీఆర్ఎస్ 37వ డివిజన్ కార్పొరేటర్ పెంట రాజేశ్‌కు చెందిన సిరి ఫంక్షన్‌హాల్‌ను కూల్చారు. ఫంక్షన్‌హాల్‌ను నాలాపై నిర్మించారని, అనుమతులు లేని కారణంగా నెల రోజుల కింద నోటీసులు జారీ చేశామని, ఫంక్షన్‌హాల్ యజమాని స్పందించకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు కూల్చివేశామని అదనపు కలెక్టర్, నగర కమిషనర్ జే అరుణశ్రీ తెలిపారు.
కూల్చివేతల విషయం తెలుసుకొన్న రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు వెంటనే అడ్డగుంటపల్లికి చేరుకొని.. కొంత సమయం ఇవ్వాలని, లేదంటే జరిమానా విధిస్తే చెల్లిస్తారని చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. పెంట రాజేశ్ కుటుంబ సభ్యులు జేసీబీ ముందు నేలపై పడుకొని అడ్డుకున్నా.. మహిళా హోంగార్డుల సాయంతో వారిని అదుపులోకి తీసుకొని ఫంక్షన్‌హాల్‌ను నేలమట్టం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు. పెంట రాజేశ్‌కు చెందిన ఫంక్షన్‌హాల్‌కు అన్ని అనుమతులున్నప్పటికీ ఇంత హడావుడిగా కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కొంత సమయం ఇవ్వాలని కోరినప్పటికీ బలవంతంగా కూల్చేశారని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని, ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరాలని ఒత్తిడి చేయగా.. తాను ఒప్పుకోలేదని, అందుకే తనపై కక్ష గట్టి ఫంక్షన్‌హాల్‌ను కూల్చేశారని యజమాని పెంట రాజేశ్ వివరించారు.