Jagdish Reddy : ప్రజలకు ఇచ్చిన హామీలను మరిపించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌పై తప్పుడు కేసు పెట్టిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్‌రెడ్డి ఆరోపించారు. తమ నాయకులపై తప్పుడు కేసులు పెట్టేందుకు ఎన్నో ఎంక్వయిరీలు చేయించారని, అయినా కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టలేదని విమర్శించారు. కేటీఆర్‌పై ఒక చిల్లర కేసు పెట్టారని, తప్పు చేసినట్లయితే శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
ఫార్ములా వన్ రేసుపై సమాధానం చెప్పడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని జగదీష్ రెడ్డి చెప్పారు. చర్చ పెట్టకుండా ఎందుకు పారిపోతున్నారని, దమ్ము లేదా..? అని ఆయన ప్రశ్నించారు. రైతు రుణ మాఫీ, మహిళా సమస్యలపై అసెంబ్లీలో చర్చనే లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పు చేసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అప్పు నాలుగు లక్షల కోట్లేనని ఆర్బీఐ స్పష్టం చేసిందని అన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఫార్ములా వన్‌పై చర్చ కచ్చితంగా జరగాల్సిందేనని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా వాస్తవాలు ప్రజలకు తెలుసని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలో 1.2 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని, దీన్నిబట్టి వాళ్ళు ఐదేళ్లలో ఏడు లక్షల కోట్ల అప్పు చేస్తారని అన్నారు. అసత్యాలతో బీఆర్ఎస్ పార్టీని బయపెట్టలేరని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, వెధవ వేషాలు వేసినా ప్రజాక్షేత్రంలో, శాసనసభలో నిలదీస్తామని
జగదీష్ రెడ్డి అన్నారు. ఫార్ములా వన్‌పై తప్పక అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని, బడే భాయ్, చోటే భాయ్ ఒకే లైన్లో ఉన్నారని ఆరోపించారు.
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయలేక తమ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కుటుంబం చేస్తున్న అవినీతి బయటపడకుండా ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కుట్రతో కేసులు పెడితే నడవదని, ఫార్ములా వన్ రేసుపై తప్పక అసెంబ్లీలో చర్చ పెట్టాలనీ స్పీకర్‌ను డిమాండ్ చేస్తున్నామని అన్నారు. చర్చ లేకుండా తప్పించుకుంటే ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు.