హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ బర్త్డే సందర్భంగా మొక్కలు నాటేందుకు, విద్యార్థులకు చాక్లెట్లు పంచేందుకు అనుమతించారనే కారణంతో హస్తినాపురం డివిజన్ పరిది జడ్పీహెచ్ఎస్ ఇన్చార్జి హెచ్ఎంను సస్పెండ్ చేయటం అమానుషమని బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మండిపడ్డారు. రాష్ర్టానికి, దేశానికి సేవలందించిన మహోన్నత వ్యక్తుల పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని, స్కూల్ సిలబస్లో ఉన్న మహనీయుల జన్మదిన వేడుకలను ప్రభుత్వం నిషేధించిందా? అని మంగళవారం ఓ ప్రకటనలో నిలదీశారు.
ఎలాంటి ప్రొటోకాల్ లేని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి కలెక్టర్ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికారని, కేసీఆర్ పుట్టిన రోజు చేసుకోవడం నేరమా? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలపై కాకుండా ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలని హితవు పలికారు. వెంటనే ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.