Errollla Srinivas | హైదరాబాద్ : దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సవాల్ విసిరారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల గురించి చెప్పాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఎర్రోళ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
ఓయూలో కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి ప్రారంభించడానికి వస్తున్నాడు. రేవంత్ శిలాఫలకాలపై పేర్లు వేసుకోగలరేమో కానీ కేసీఆర్‌ను విద్యార్థుల గుండెల నుంచి తొలగించలేరు. ప్రజా పాలనను ఏడో గ్యారంటీగా చెప్పుకుని యూనివర్సటీల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ముళ్ల కంచెల పాలన తెచ్చెoదుకు మెమోలు సర్క్యులర్లు ఇస్తున్నారంటూ శ్రీనివాస్ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు కావస్తోంది. సీఎం నుంచి కింది స్థాయి కాంగ్రెస్ నేతలు అబద్ధాల్లో గోబెల్స్‌ను మించిపోయారు. అబద్దాలు తప్ప రేవంత్ పాలనలో హామీల అమలు శూన్యం. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు యూనివర్సిటీ విద్యార్థులను తాగుబోతులు, అడ్డా కూలీలతో పోల్చారు. విద్యార్థుల పట్ల విచక్షణ కోల్పోయి మాట్లాడిన రేవంత్ ఈ రోజు సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఉద్యమంలో విద్యార్థులు ఉంటే.. తెలంగాణ ద్రోహుల పక్కన రేవంత్ ఉన్నారు. విద్యార్థులకు క్షమాపణ చెప్పాకే రేవంత్ రెడ్డి సీఎం హోదాలో యూనివర్సిటీలో అడుగు పెట్టాలి అని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాలు ఇచ్చి తన ఘనతగా రేవంత్ చెప్పుకుంటున్నారు. రేవంత్ తన పాలనలో ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్లపై శ్వేతపత్రం ప్రకటించాలి. ఎన్ని రోజులు అబద్దాలు చెప్పి బతుకుతారు? రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలు రూ. 6 వేలకు మించి ఉండవు. దమ్ముంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల గురించి చెప్పాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
విద్యార్థులపై రకరకాల నిర్బంధాలు విధిస్తున్నారు. నిరుద్యోగ యువతతో ఆడుకుంటున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి, కోదండరాం, ఆకునూరి మురళి, తీన్మార్ మల్లన్నలకు ఉద్యోగాలు వచ్చాయి. కానీ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాలేదు. నిరుద్యోగ యువత కష్టాలు సో కాల్డ్ మేధావులు కోదండరాం, ఆకునూరి మురళిలకు కనిపించడం లేదా..? ఎప్పుడు వారు నిరుద్యోగుల తరపున మాట్లాడతారు? అని ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు.