హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇప్పటి వరకు 49మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఆ పిల్లల చావుల పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా? అని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ నిలదీశారు. విద్యార్థుల తల్లుల గర్భశోకానికి కారణం రేవంత్‌రెడ్డి సర్కార్ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 48మంది పిల్లలు చనిపోయినా.. సీఎం, మంత్రుల్లో చలనం లేదని, ఇంకా ఎంతమంది చనిపోతే స్పందిస్తారని మండిపడ్డారు. వీటిని ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నామని తెలిపారు. ఇంత జరిగినా గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణపై సమీక్ష నిర్వహించరా? అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని ఫైర్ అయ్యారు. తెలంగాణభవన్‌లో బుధవారం బీఆర్ఎస్ నేతలు కిశోర్‌గౌడ్, వై సతీశ్‌రెడ్డి, విద్యార్థి నాయకులు శ్రీనివాస్‌యాదవ్, శరత్చంద్ర, మనోజ్, వీరస్వామి, నాగరాజు, ప్రశాంత్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తినటానికి వీల్లేని అన్నం పెట్టారని, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థిగా ఆ చేదు అనుభవం తనకు ఉన్నదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పాలనలో పదేండ్లపాటు మంచి భోజనం, నాణ్యమైన విద్య అందించినట్టు తెలిపారు. కాంగ్రెస్ 11నెలల పాలనలో గురుకులాల ప్రతిష్ఠ అధఃపాతాళానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
గురుకులాల్లో తరచూ ఫుడ్‌పాయిజన్ ఘటనలపై హైకోర్టు మొట్టికాయలు వేస్తే.. పిల్లలు కుర్కురేలు తినటం వల్లే ఫుడ్‌పాయిజన్ అయిందని చెప్పారని, ఇంతకన్నా చేతగాని ప్రభుత్వం ఉన్నదా? అని ఎర్రోళ్ల శ్రీనివాస్ నిలదీశారు. బయటి ఫుడ్ తినటంతోనే పాయిజన్ అయ్యిందని కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే అంటున్నారని, విద్యార్థులేమో తాము ఎకడా ఏమీ తినలేదని చెబుతున్నారని పేర్కొన్నారు. పేద పిల్లలకు కడుపు నిండా నాణ్యమైన భోజనం పెట్టలేని మీకు విజయోత్సవాలు జరుపుకొనే నైతిక హక్కు ఎక్కడిది? అని నిలదీశారు.
హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురుకులాలు, ప్రభుత్వ బడుల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఉన్నవి ‘గురుకులాలా లేక నరకకూపాలా? అని ప్రశ్నించారు. మీకు బిర్యానీలు.. బీద బిడ్డలకు బొద్దింకలా? మీకు విందు భోజనాలు.. విద్యార్థులకు విషమా అని నిలదీశారు. తెలంగాణ తెగువ చూపించాల్సిన సమయం అసన్నమైందని తెలిపారు. ప్రభుత్వ పెద్దల అనాలోచిత నిర్ణయాలతో 48 మంది గురుకుల విద్యార్థులు బలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ సంక్షేమభవన్‌ను ముట్టడించిన బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడాన్ని సతీశ్‌రెడ్డి ఖండించారు. మంచి భోజనం పెట్టాలని అడిగితే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న వరుస దారుణాలపై మేధావులు నోరు విప్పాలని డిమాండ్ చేశారు.