గత 10 నెలల దుర్మార్గపు కాంగ్రెస్ పాలనలో విషాహారం తిని 49 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని బీఆర్ఎస్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఆ పిల్లల చావుల పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా? అని నిలదీశారు. ఇవన్నీ ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే అని ఆయన అన్నారు. ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నా ముఖ్యమంత్రి, మంత్రుల్లో చలనం లేదని మండిపడ్డారు. ఇంకా ఎంతమంది చనిపోతే స్పందిస్తారని నిలదీశారు.
రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణపై సమీక్ష నిర్వహించరా? అని సీఎం రేవంత్ రెడ్డిని ఎర్రోళ్ల శ్రీనివాస్ నిలదీశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని మండిపడ్డారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడతామనడం కాదు.. పేద బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల పిల్లలకు మూడు పూటలా నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్టు శిఖరం ఎక్కే స్థాయికి వెళ్తే.. కాంగ్రెస్ 11 నెలల పాలనలో గురుకులాల ప్రతిష్ఠ అతఃపాతాలానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. పాఠాలు దేవుడెరుగు పిల్లల ప్రాణాలు దక్కితే చాలు అనే పరిస్థితి విద్యార్థులు తల్లిదండ్రుల్లో నెలకొన్నదని విమర్శించారు.
గత పది నెలల దుర్మార్గపు కాంగ్రెస్ పాలనలో విషాహారం తిని 49 మంది విద్యార్థులు మరణించారు.
ముమ్మాటికీ ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే.
– బీఆర్ఎస్ నాయకులు @DrErrolla 🔥 pic.twitter.com/RjLHXQgHAu
— BRS Party (@BRSparty) November 27, 2024
గురుకులాల్లో వరుస ఫుడ్‌పాయిజన్ ఘటనలపై హైకోర్టు మొట్టికాయలు వేస్తే.. పిల్లలు కుర్కురేలు తినడం వల్లే ఫుడ్‌పాయిజన్ అయిందని చెప్పారని ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకంటే చేతగాని ప్రభుత్వం ఉన్నదా? అని మండిపడ్డారు. బయటి ఫుడ్ తినడం వల్లే ఫుడ్‌పాయిజన్ అయ్యిందని కలెక్టర్, లోకల్ ఎమ్మెల్యే అంటున్నారని, విద్యార్థులేమో తాము బయటకి వెళ్లలేదని, ఎక్కడ ఏమి తినలేదని చెప్తున్నారని అన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోవడానికి విద్యాశాఖ మంత్రి, శాంతి భద్రతలు చూడటానికి హోంమంత్రి లేరని అన్నారు. ముఖ్యమంత్రి వద్ద ఈ శాఖలు ఉన్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద పిల్లలకు కడుపు నిండా నాణ్యమైన భోజనం పెట్టలేని మీకు విజయోత్సవాలు జరుపుకొనే నైతిక హక్కు ఎక్కడిది? అని నిలదీశారు. విద్యార్థుల సమస్యలపై బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని సంక్షేమభవన్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపున్న బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను అరెస్టు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.