హైదరాబాద్, ఆగస్టు19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓట్ చోర్ అంటూ దేశమంతా తిరుగుతున్నారని, ఆయన పార్టీకే చెందిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జాబ్చోర్గా మారారని, ఆయన నిరుద్యోగుల చీటర్ అయ్యారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, నిరుద్యోగుల భృతి ఇస్తామని ఇష్టారాజ్యంగా అబద్ధపు హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చి వాటిని విస్మరించిన సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
పోలీస్ పహారా నడుమ రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, అదెలా ప్రజాపాలన అవుతుందని నిలదీశారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్‌రెడ్డి గోబెల్స్‌ను మించిపోయారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉండగా, ఓయూ విద్యార్థులను తాగుబోతులతో, అడ్డాకూలీలతో పోల్చి, విద్యార్థులపై విచక్షణ కోల్పోయి రేవంత్‌రెడ్డి మాట్లాడిని విషయాన్ని ఓయూ విద్యార్థులు మరిచిపోలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చారో? ఏయే నోటిఫికేషన్ల ద్వారా ఎన్నెన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో? శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలో నిర్మించతలపెట్టిన హాస్టల్ భవన నిర్మాణాలను ప్రారంభించడానికే సీఎం ఓయూకు వస్తున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క భవనం కూడా మంజూరు చేయలేదని దుయ్యబట్టారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే లక్షల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని అశోక్‌నగర్ సాక్షిగా రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో లెక్కలతో సహా చెప్పాలని డిమాండ్ చేశారు. ఓయూలో దమ్ముంటే పోలీసులు లే కుండా సీఎం ఓయూకు రావాలని అన్నారు. నిరుద్యోగుల హామీలను అమలు చేయకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
నిరుద్యోగుల జీవితాలతో సీఎం రేవంత్‌రెడ్డి ఆటలాడుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఈనెల 21న హాస్టల్ భవనాలు ప్రా రంభం కోసం ఓయూకు రేవంత్‌రెడ్డి వస్తున్న నేపథ్యంలో విద్యార్థులను అరెస్టు చేయొద్దని డిమాండ్ చేశారు. హామీలపై నిలదీయడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పాలనలో ఓయూకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తేల్చిచెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబా లు, బీఆర్ఎస్ నేతలు సత్య, జంగయ్య, దశరథ్, శ్రీకాంత్ ముదిరాజ్ పాల్గొన్నారు.