హైదరాబాద్, జనవరి 21(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోలీసు లు లేనిదే పాలన సాగేటట్టు లేదని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రభు త్వం ఏ కార్యక్రమం చేపట్టినా ముందు పోలీసులు ఉండాల్సిందేనా? అని ప్రశ్నించారు. చివరికి గ్రామ సభలు కూడా పోలీసుల మధ్యే జరుగాలా? అని నిలదీశారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏడో గ్యారెంటీ కింద ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అడుగడుగునా అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలతో అప్రజాస్వామిక పాలన సాగుతున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వం పాలనను గాలికొదిలేసిందని, సీఎం, కొంత మంది మంత్రులు విదేశాల్లో, మిగిలిన కొందరు పక్కరాష్ర్టాల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్నది ప్రజాపాలనా? పోలీసు పాలనా? అని ఆయన ప్రశ్నించారు.