హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ అమలయ్యాకే గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. జీవో-29తో ఇప్పటికే ఎస్సీ అభ్యర్థులు నష్టపోయారని, వర్గీకరణ అమలు చేయకుండా ఫలితాలు వెల్లడిస్తే మరోసారి తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీల్లో మాదిగ, ఇతర ఉపకులాలకు న్యాయం చేయాలని దశబ్దాలుగా పోరాటం కొనసాగుతున్నదని తెలిపారు.
సుప్రీం కోర్టు సైతం ఎస్సీ వర్గీకరణ అమలుచేయాలని తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని, బీజేపీ పదేండ్లు కాలయాపన చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాదిగలు, మాదిగ ఉపకులాలపై బీఆర్ఎస్ చిత్తశుద్ధితో పనిచేసిందని తెలిపారు. వర్గీకరణ చేయకుండా ఫలితాలు వెల్లడిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరించారు.