HCU | ఢిల్లీ బాసుల జేబులు నింపేందుకు.. గల్లీలో భూములను తెగనమ్ముతున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌ని ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై లాఠీఛార్జ్ జరిగినట్లుగా సెంట్రల్ యూనివర్సిటీలోనూ లాఠీఛార్జ్ జరుగుతుందని మండిపడ్డారు. విద్యార్థులను గదుల్లోకి వెళ్లి లాక్కొచ్చి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్క తెలంగాణలే లేరని.. దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారని.. విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. భట్టి, శ్రీధర్‌బాబు సెంట్రల్ యూనివర్సిటీలోనే చదివారని.. సెంట్రల్ యూనివర్సిటీపై భట్టి, శ్రీధర్ బాబుకు ప్రేమ లేదా? అని నిలదీశారు.
విద్యార్థులు చేస్తున్న పోరాటానికి భట్టి, శ్రీధర్ బాబు మద్దతు తెలుపుతారని అనుకున్నామన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములపై విద్యార్థులకు ప్రయోజనం లేదని.. కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎజెండా లేదని విమర్శించారు. పేమెంట్ బ్యాచ్ ఎవరో అందరికీ తెలుసునని.. ఢిల్లీ బాసుల జేబులు నింపేందుకే గల్లీలో భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం, పీసీసీ, మంత్రి పదవులు, ఎమ్మెల్యే కావాలంటే పేమెంట్ ఇవ్వాల్సిందేనని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఇందిరమ్మను అవమానించారని.. తెలంగాణ, ఆంధ్రా ఉద్యమంలో ఇందిరా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ స్థాపించారని.. సెంట్రల్ యూనివర్సిటీలో ఇందిరాగాంధీ నాటిన మొక్కను తీసిన కలుపు మొక్కలు మీరు అంటూ ధ్వజమెత్తారు.
ఇందిరమ్మ ఇచ్చిన భూమిని రూ.30వేల కోట్లకు అమ్మాలని గుంటనక్కలు చూస్తున్నాయని.. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పడం ఒక బోగస్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. నాడు గురువు భూమి ఇచ్చిపోతే.. నేడు శిష్యుడు భూమిని అమ్ముతున్నాడని మండిపడ్డారు. 2004లో వైఎస్ సీఎం అయ్యాక భూకేటాయింపులు రద్దు చేశాక.. ఎట్లా రద్దు చేస్తారని రేవంత్ రెడ్డి అన్నారని.. నాడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీలకంగా ఉన్నారు కాబట్టి 400 ఎకరాల భూమిని బిల్లీరావు అనే ప్రైవేటుకు వ్యక్తికి ఇచ్చారని.. రాజ్యాంగ సవరణ ద్వారా 2,300 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీకి కేంద్రం ఇచ్చిందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన భూమిని టాటా కంపెనీకి 200 ఎకరాలు, ఇంకో కాలేజీకి 100 ఎకరాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 370 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో లేదన్నారు. 400ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమని.. 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి తనఖా పెట్టి రూ.30వేలకోట్లు తీసుకున్నారన్నారు.
400 ఎకరాల భూమిని వేలం వేసే విధంగా ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. 400 ఎకరాలు కాపాడేందుకు రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ చేసిన ప్రయత్నం లేదా..? అంటూ ప్రశ్నించారు. 400 ఎకరాలు మేమే తెచ్చినట్లు రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేస్తున్నారని.. దామగుండంలో అడవులను మొత్తం నరికారని.. అంబేద్కర్ యూనివర్సిటీ భూములను కొల్లగొట్టాలని చూస్తున్నారన్నారు. హెచ్‌సీయూ భూములపై ప్రభుత్వం కన్నుపడిందని.. నాటి చంద్రబాబు.. నేటి రేవంత్ రెడ్డి పాలనకు తేడా లేదన్నారు. 16 నెలల్లో కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేసిందని.. సర్క్యూలర్ ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను రెచ్చగొట్టారని.. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పెట్టుకున్నారని మండిపడ్డారు. విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు తారుమారు అయ్యాయని.. భూములను అమ్మి ప్రభుత్వాన్నినడుపుతున్నారని విమర్శించారు.