కాంగ్రెస్ ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఏమైందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. అన్నం పెట్టిన వారికే సున్నం పెడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని దగా పాలన అని విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో నిరుద్యోగులతో కలిసి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత అరిగోస పుచ్చుకుంటుందని, యువత నోట్లో మట్టి కొడుతుందని మండిపడ్డారు. మార్పు కోసం కాంగ్రెస్కు నిరుద్యోగ యువత అవకాశం ఇచ్చిందని, మార్పు కోసం ఓటేసిన పాపానికి నిరుద్యోగ యువత ను కాంగ్రెస్ వేధిస్తోందన్నారు.
రేవంత్ రెడ్డికి జాబ్ కేలండర్ విడుదల చేయడం చేతకాదని, ఆయన పీఆర్ స్టంట్లలో బిజీగా ఉన్నారని ఏనుగుల రాకేశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. డీఎస్సీలో కేవలం 11 వేల పోస్టుల మాత్రమే భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని, మెగా డీఎస్సీ లో 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. జీవో 46 పై ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ ఏం చెప్పింది, ఇపుడేం చేస్తోందంటూ నిలదీశారు. కాంగ్రెస్కు మెజారిటీ వచ్చినా గవర్నర్ వాళ్లను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకపోతే రేవంత్ రెడ్డికి ఎంత భాధ ఉంటుందో.. అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు తగిన మార్కులు వచ్చినా ఉద్యోగాలు ఇవ్వక పోతే అంతే బాధ ఉంటుందన్నారు.