హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాధనాన్ని గల్లీలో పేదలకు పంచకుండా ఢిల్లీలో రాహుల్‌గాంధీకి పంచుతున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ విమర్శించారు. రూ.25,000 కోట్లు ప్రభుత్వ ఖజానాలో ఉన్నట్టు చెప్పిన సీఎం.. ఆ సొమ్ము ఎవరి చేతిలోకి వెళ్లిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 83 వేల 500 సీఎంఆర్ఎఫ్ చెకులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దగాకోరు కాంగ్రెస్‌ను బొంద పెట్టాలని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేసి విమానంలో ఢిల్లీకి తిరుగుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో గొర్రెల కోసం కట్టిన డీడీలకు ఇంతవరకు డబ్బులు రిలీజ్ చేయకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. గొల్లకురుమల వర్గానికి చెందిన బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనిపై గొల్ల కురుమలు, యాదవ సోదరులు ఆలోచన చేయాలని కోరారు. బీసీల వ్యతిరేకిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.