హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చిందని బీఆర్ఎస్ నేత జీ దేవీప్రసాద్ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధ పాలనేనా అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పిన కాంగ్రెస్ తొమ్మిది నెలలుగా పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో దేవీప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ద్వారా నిర్బంధం కొనసాగుతున్నదని అన్నారు. కాంగ్రెస్ నిర్బంధాలపై మేధావులు స్పందించాలని కోరారు. ప్రభుత్వ దవాఖానల పరిస్థితిపై ముగ్గురితో కమిటీ వేస్తే వాళ్లను అనుమతించలేదని, ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై రాళ్ల దాడి చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై మరో ఎమ్మెల్యే దాడి చేశారని, ప్రశ్నించే వారిని పోలీస్స్టేషన్లకు తిప్పుతున్నారని మండిపడ్డారు.
ధర్నాలు చేస్తే రైతులపై కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా సిబ్బందిపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధ రాజ్యమా? అని నిలదీశారు. పౌరహకుల సంఘాల నేతలను అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకై రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ఉద్యోగ సంఘాల నేతలను సీఎం తొమ్మిది నెలల నుంచి కలవడం లేదని విమర్శించారు. ఉద్యోగ సంఘాల నాయకుల మధ్య చిచ్చుపెట్టే విధంగా కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హైడ్రాపై ప్రభుత్వానికి స్పష్టత లేదని, హైదరాబాద్ నగరంలో 60 శాతం ప్రజలు నిరాశ్రయులు అవుతారని చెప్పారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, రేవంత్రెడ్డి సోదరుడికి నోటీసులు ఇచ్చి వదిలేశారని, పేదలపై మాత్రం ఉకుపాదం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.