హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 7 నెలలుగా పాలన పూర్తిగా గాడితప్పిందని బీఆర్ఎస్ నేత, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదని మండిపడ్డారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, వృద్ధులు, మహిళలు ఇలా అన్నివర్గాలు ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే పరిష్కరించాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక కొత్త పథకం, ఒక కొత్త ప్రాజెక్టును చేపట్టకున్నా 200 రోజుల్లో రూ.28 వేల కోట్ల అప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా తీసుకెళ్తే.. నేటి కాంగ్రెస్ పాలనలో ఒక్క వర్గం కూడా సంతృప్తికరంగా లేదని తెలిపారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, హామీల అమలు కోసం జూడాలు, అంగన్వాడీ టీచర్లు, పింఛన్ల కోసం వృద్ధులు, మహిళలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని వెల్లడించారు.
చివరికి చేరికలపైనా కాంగ్రెస్ నేతలే ఆందోళన చేసే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. రుణమాఫీ, రైతుబంధు విధివిధానాల రూపకల్పనపై ఎందుకు జాప్యం జరుగుతున్నదని ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ యాత్రలపై ఉన్న శ్రద్ధ రైతులకు భరోసా ఇవ్వటంపై లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రుణమాఫీ, రైతుబంధుపై రివ్యూ చేశారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు కట్టబెడితే సింగరేణి బొగ్గుబ్లాకును అమ్మేందుకు ఆ పార్టీ సిద్ధమైందని విమర్శించారు. తెలంగాణ జీవనాడి అయిన సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి రెండు పార్టీలు కంకణం కట్టుకున్నాయని, ఆ పార్టీలకు ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అధికారులు ప్రొటోకాల్ పాటించటం లేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట కల్యాణలక్ష్మి చెక్కులను వారితో పంపిణీ చేయించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.