Daysam Vinay Bhasker | వరంగల్ : కార్మికుల సంక్షేమాన్ని కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మండి పడ్డారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కార్మికుల హక్కుల సాధన కోసం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృతివనం ఏకశిలా పార్కు వద్ద వివిధ కార్మిక సంఘాలతో కలిసి దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో ధర్నా కార్యక్రమాన్ని శనివారం రోజున నిర్వహించారు.
ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. కార్మికులు ఎదుర్కొంటోన్న వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్న ఉద్దేశంతోనే ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేలాది మంది చిరు వ్యాపారుల కుటుంబాలను మున్పిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వేధించడాన్ని ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారుల రక్షణ కోసం నాడు చట్టం తెచ్చేలా బీఆర్ఎస్ ఎంపీలు ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ వీధి వ్యాపారులకు అనేక రుణాలను, వెండింగ్ జోన్లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. నాడు తెచ్చిన 2014 చిరు వ్యాపారుల రక్షణ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, వరంగల్ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక మంత్రిని కూడా నియమించకుండా ఏడాదిన్నర పాలన సాగించేసిందంటేనే కార్మికులపై వారికున్న చిత్తశుద్ధి అర్ధం అవుతోందన్నారు. కార్మికులకు ఏమీ చేయని కాంగ్రెస్… భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను మాత్రం మళ్లించేసి కార్మికులను ముంచిందని మండిపడ్డారు. అసంఘటిత, సంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక,ఆర్ధిక భద్రతలు కల్పించడంతో పాటు వారికి ఇఎస్ఐ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.
గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక భవన్ కోసం కేటాయించిన 2600 గజాల స్థలంలో కార్మిక భవనం నిర్మాణానికి నిధులు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సూచించారు. బీడీకార్మికుల పింఛను విధానంలో 2014 అనే కటాఫ్‌ను ఎత్తివేయాలన్నారు. స్కీమ్ వర్కర్లకు ఎన్నికల ప్రచాంరలో ఇచ్చిన హామీ మేరకు రూ. 26 వేల పింఛను అందించాలన్నారు. జూన్ 9న దేశ వ్యాప్తంగా జరుగుతోన్న సార్వత్రిక సమ్మెలో ప్రతీ ఒక్క కార్మిక సంఘం.. ప్రతీ కార్మికుడూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. పోరాటాలతోనే మన హక్కులు సాధించుకోగలం.. ఉద్యమాలతోనే నిరంకుశ ప్రభుత్వాల మెడలు వంచగలం అని వినయ్ భాస్కర్ ఉద్వేగ పూరితంగా పిలుపు నిచ్చారు.
రానున్న రోజుల్లో కార్మికుల సమస్యలపై రక రకాల ఉద్యమాలతో దూసుకుపోదామని ఆయన అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్ట కొట్టిందని అన్నారు. ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు సంవత్సరానికి రూ.12,000 నగదును భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సంకు నర్సింగ్, సోదా కిరణ్, కార్యక్రమ కన్వీనర్ నాయిని రవి ఎంజాల మల్లేశం, ఈసంపల్లి సంజీవ,రవీందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి,జయరాం, తేలు సారంగపాణి, రఘుపతి రెడ్డి, శివకుమార్, కాటపురపు రాజు, రాజారపు రాజు, బిక్షపతి, రఘు, కృష్ణ, రాజు, ఎండి ఇస్మాయిల్, గుంజ స్వామి, కొండయ్య రవి, మా తెలంగాణ ఆటో యూనియన్ నాయకులు ప్రతాపరుద్ర ఆటో యూనియన్ నాయకులు భవన నిర్మాణ రంగ 14 రంగాల నాయకులు చిరు వ్యాపారులు, పెద్ద ఎత్తున కార్మిక నాయకులు కార్మికులు హాజరయ్యారు.