Dasoju Sravan | హైదరాబాద్ : బీఆర్ఎస్ సభ్యుడు దాసోజు శ్రవణ్ కుమార్ ఈ నెల 16న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మార్చి 30న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా 16న కౌన్సిల్ హాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సారథ్యంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో దాసోజు శ్రవణ్ క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట ప్రధాన అనుచరుడిగా పనిచేశారు. అనేక వేదికల మీద తెలంగాణ భావజాలవ్యాప్తికి కృషి చేశారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో బడుగుల గొంతుకను వినిపించారు. బీసీ కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో భాగంగా ఇటు పార్టీ పక్షాన, అటు న్యాయవాదిగా తన వాదనను బలంగా వినిపించారు. కులగణన చేయాలని కోర్టులో కేసు వేసిన తొలి నాయకుడిగా బడుగుల మనసులు గెలిచారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1987లో విద్యార్థి నాయకుడిగా, ఆర్ట్స్ కళాశాల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. టెక్‌మహీంద్రా, హిటాచీ తదితర కంపెనీల్లోనూ జనరల్ మేనేజర్, హెచ్ఆర్ డైరెక్టర్ సహా పలు ఉన్నత హోదాల్లో పనిచేశారు. సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ప్రస్థానం కొనసాగిస్తున్నారు.