హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ప్రజల దృష్టిని మళ్లించటమే పరిపాలనా? అని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. పగ, ప్రతీకార రాజకీయాలకు, యుక్తులకు పరాకాష్టగా రేవంత్‌రెడ్డి పరిపాలన సాగుతున్నదని ధ్వజమెత్తారు. విద్యుత్తు లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్ది వెలుగులు విరజిమ్మే తెలంగాణగా మార్చిన కేసీఆర్‌కు సంజాయిషీ నోటీసులా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రైతాంగానికి 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు సంజాయిషీ నోటీసులా? అని ప్రశ్నించారు.
ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతర విద్యుత్తు సరఫరా చేసి, అభివృద్ధికి బాటలు వేసినందుకు సంజాయిషీ నోటీసులా? అని నిలదీశారు. ప్రతీకార రాజకీయాలను పకనపెట్టి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా 24 గంటల విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, అభివృద్ధిని అడ్డుకొనే దుష్ప్రయత్నాలను విరమించాలని హితవుపలికారు. కేసీఆర్ నాయకత్వంలో వెలుగులు విరజిమ్మిన రాష్ట్రం, కరెంట్ లోటుతో సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీకార రాజకీయాలతో మరింత కష్టతరం చేయడం సరికాదని సూచించారు.
రుణమాఫీ, రైతుభరోసా, ఉద్యోగాలు, రూ.4 వేల పింఛన్, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ.2,500 వంటి పథకాలు అమలు చేయటం చేతగాక సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా రాజకీయ కుయుక్తులను పకనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ఆకాంక్షలను, వారి అభివృద్ధిని అణగదొకే ప్రయత్నాలను విరమించాలని దాసోజు హితవుపలికారు.