హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన బృందం ఏర్పాటుచేసిన హోర్డింగ్ కుత్సిత రాజకీయాలకు ప్రతీక అని బీఆర్ఎస్ నేత డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడు హోర్డింగ్ పెట్టడం రేవంత్‌రెడ్డి పనితీరులోపం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమని మండిపడ్డారు. ‘ఇది తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఒక చీప్ ప్రొపగాండా. సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి తకువ స్థాయి రాజకీయాలు చేయడం దురదృష్టకరం’ అని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌పై కాంగ్రెస్ శ్రేణులు నిరాధారమైన నిందారోపణలు చేయడం తగదని హితవుపలికారు. దావోస్ సమ్మిట్-2025లో రేవంత్‌రెడ్డి ప్రాతిని ధ్యం తెలంగాణ రా ష్ట్ర గౌరవాన్ని తగ్గించిందని విమర్శించారు. అంతర్జాతీ య వేదికపై ఆయన వేషధారణ, తప్పుడు మాటలతో పెట్టుబడుల హామీ లు ఇవ్వడం, రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీశాయని తెలిపారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రేవంత్‌రెడ్డి దిగజారి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ‘పనితీరు ద్వారా చూపించాల్సిన చోట, రేవంత్‌రెడ్డి ఇలాంటి చీప్ రాజకీయాలను అనుసరిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆ కాంక్షలకు అనుగుణంగా లేదు’ అని విమర్శించారు.