కరీంనగర్ ప్రతినిధి, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అధికార చిహ్నాన్ని మార్చడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అది రేవంత్‌రెడ్డి తరంకాదని పునరుద్ఘాటించారు. చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని చెబుతున్న రేవంత్‌రెడ్డికి జాతీయ జెండాలో అశోకుడి చక్రం ఉన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. అశోకుడి నాలుగు సింహాల ముద్రను కాంగ్రెస్ పార్టీకి చెందిన మొదటి పార్లమెంట్ సభ ఆమోదించింది. ఇప్పుడు దానిని కూడా మార్చుతారా? అని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. గురువారం కరీంనగర్ నుంచి ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వరంగల్ ధర్నాలో చెప్పిన విషయాలను మరోసారి ప్రస్తావించారు. అంతకంటే విస్పష్టంగా చర్చకు దారి తీసే అంశాలను ప్రస్తావించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొదటి క్యాబినెట్ మీటింగ్‌లో తెలంగాణ చిహ్నాన్ని మార్చేస్తామని చెప్పడాన్ని అవివేకమని నేను ఆనాడే చెప్పాను. ఇది కరెక్ట్ కాదు అని ఖండించాను. చిహ్నాన్ని మార్చేందుకు ఒక సబ్ కమిటీ వేసి విచారిస్తామని చెప్పారు. ఏదైనా కమిటీ ప్రజాభిప్రాయాన్ని సేకరించిందా? రేవంత్‌రెడ్డి చెప్పినట్టు సివిల్ సొసైటీలో ఏదైనా ప్రజాభిప్రాయ సేకరణ జరిపిందా? కళాకారులు, మేధావులు, వ్యాపారవేత్తలు, డాక్టర్లు, ఇంజినీర్లు, యువకులతోగానీ ఎక్కడైనా చర్చించారా? స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన నిర్ణయాన్ని ఆయన అమలు జరపలేదు. కేవలం పేరు కోసం మాత్రమే కమిటీ వేశారు. ఈ కమిటీ ఎక్కడా పని చేయలేదు. ఇంకో విషయం ఏమిటంటే రాష్ట్ర చిహ్నం రాచరిక వ్యవస్థకు నిదర్శంగా ఉన్నదని చెప్పారు. దీనిపై నేను అదే రోజు స్పందించాను. భారత జాతీయ జెండాలో అశోక చక్రం దేనికి చిహ్నం.
దానిని తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలోని మొదటి రాజ్యాంగ సభ ఆమోదించింది కదా.. ఇందులో కాంగ్రెస్ పార్టీకే చెందిన ప్రధాని నెహ్రూ ప్రముఖ పాత్ర పోషించారు. అశోక చక్రంతోపాటు నాలుగు సింహాలు ఉన్న జాతీయ ముద్ర ఎక్కడి నుంచి తీసుకున్నారు. దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం అశోక చక్రవర్తి పరిపాలించినప్పటి చిహ్నం అది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొత్త బిచ్చగాడు రేవంత్‌రెడ్డికి ఆ పార్టీ నిర్మాణంలో కీలకంగా ఉన్న నెహ్రూ ప్రభుత్వమే ఆమోదించిందనే సంగతి తెలియదా..? జాతీయ జెండాలో అశోక చక్రాన్ని, నాలుగు సింహాలున్న జాతీయ చిహ్నాన్ని తీసేస్తమనే నిర్ణయం తీసుకోవడానికి సోనియా గాంధీ అవకాశం ఇస్తున్నరా? అని ప్రశ్నించదలుచుకున్నా. అందుకే నేను సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి ఎక్స్‌లో ట్వీట్ చేశాను.
సీఎం రేవంత్‌రెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని, దీనిని మీరు ఆమోదిస్తే రేపు దేశ వ్యాప్తంగా చాలా మందికి ఇవే ఆలోచనలు వస్తాయని చెప్పాను. మూడు రంగుల జెండా తీసివేసి కాషాయ జెండాను పెట్టాలని కొందరు, ఎర్ర జెండా ఎగుర వేస్తామని మరి కొందరు అంటున్నరు. వాళ్లకు అవకాశం ఇచ్చినట్టే అవుతుందని నేను స్వయంగా సోనియాగాంధీనే అడుగుతున్నాను. జూన్ 2న మీ సమక్షంలో రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రతిపాదిస్తే, దానిని మీరు అంగీకరిస్తారా? అని సోనియాగాంధీనే ప్రశ్నించదలుచుకున్నాను. అప్పుడు సోనియాగాంధీ నెహ్రూ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించినట్టు అవుతుంది కదా.. కాబట్టి సీనియర్ కాంగ్రెస్ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న. మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
రేవంత్ రెడ్డికి ఎక్కడ పనిలేదా..? మార్పు మార్పు అన్నడు. రూ.10 వేల రైతుబంధును రూ.15 వేలు చేస్తానని, రూ.2 వేల ఆసరా పెన్షన్లను రూ.4 వేలు చేస్తామని, రూ.2 లక్షల రుణ మాఫీ అన్నడు. దీని మీద దృష్టి పెట్టకుండా వివాదాలకు తెరతీస్తున్నాడు. రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని రేవంత్‌రెడ్డి ఏ కారణాలతో తొలగిస్తున్నాడు. సరైన కారణాలు చెప్పాలి కదా.. కేవలం రాచరిక వ్యవస్థకు చిహ్నాలుగా ఉన్నదని అంటున్నారు. అంటే భారత జాతీయ జెండాలో ఉన్న అశోక చక్రాన్ని కూడా తొలగించాలని రేవంత్‌రెడ్డి చెబుతున్నారా..? నాలుగు సింహాలున్న జాతీయ చిహ్నాన్ని తొలగించాలని చెబుతున్నారా..? దీనికి కాంగ్రెస్‌పార్టీ జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది.
తెలంగాణ కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2015 మార్చి 26న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పంపించిన జీవో ప్రకారంగా ఇప్పుడున్న అధికారిక చిహ్నం ఆచరణలోకి వచ్చింది. ఇందులో కేంద్ర హోంశాఖ రూల్స్ ఆఫ్ 4 సబ్ క్లాజ్ 2 స్టేట్ ఎంబ్లం ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ఆన్ యూజ్ -2007 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేగానీ దీనిని మార్చడానికి లేదు. వచ్చే నెల 2న అయ్యే పని మాత్రం కాదు. రాష్ట్రం నుంచి ప్రతిపాదన చేయాలి. కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడే చిహ్నం మార్చడానికి అవకాశం ఉంటుంది.
రాష్ట్ర కోడ్ టీఎస్ కంటే ముందు మేమే టీజీగా పెట్టాలనకున్నాం. కానీ, కొన్ని రాష్ర్టాలకు కోడ్స్ సిమిలర్‌గా ఉన్నందున టీఎస్‌గా నిర్ణయించాం. తమిళనాడు సింబల్లో మధుర మీనాక్షి సింబల్ ఉంటుంది. డీఎంకే దాదాపు దేవున్ని నమ్మే పార్టీ కాదు. అయినప్పటికీ దానిని ఆ పార్టీ ముట్టుకోలేదు. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చిహ్నాన్ని మార్చడానికి జీవో తీసేందుకు వీలు లేదు. దీనిని ఎట్ల మార్చుతారో చూసి నేనే స్వయంగా కోర్టుకు వెళ్లదలుచుకున్నా. వేసవి సెలవులు పూర్తయిన వెంటనే హైకోర్టులో కేసు వేస్తా. రేవంత్‌రెడ్డి ప్రతిపాదన చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. కేంద్రం ఒప్పుకుంటేనే చిహ్నం మారుతుంది. అది ఏ సమయానికి వస్తుందో నాకు తెలియదు. రేవంత్‌కు, ఇప్పుడున్న మోడీకి ఉన్న సంబంధాలు ఎట్లా ఉన్నాయో.. రేపు ఏ ప్రభుత్వం వస్తుందో ఎవరికీ తెలియదు.
రేవంత్‌రెడ్డి ఈ హడావిడి ఎందుకు చేస్తున్నాడు అంటే చేస్తున్న తప్పులకు ప్రజా ఆగ్రహానికి గురి కాకుండా పక్కదారి పట్టించేందుకే. సమస్యలు గాలికి వదిలేసి ఇలాంటి వివాదాలు ముందుకు తెచ్చి పెడుతున్నారు. నిజానికి ఇప్పుడు రైతుబంధు వేయాల్సి ఉంటుంది. రైతులు కోత కోసినప్పుడు రైతుబంధు ఇచ్చుడు కాదు. తొలకరి జల్లులు పడినప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు విత్తనాల కోసం రైతులు తన్నుకు చస్తున్నారు. ఇలాంటి పరిస్థితి పదేళ్లలో ఎప్పుడైనా ఉన్నదా..? చెప్పులు, డబ్బాలు క్యూ లైన్లలో పెట్టుకున్నారా?, ఇలాంటి సమస్యలను సైడ్ ట్రాక్ చేసేందుకే కొత్త సమస్యను తెచ్చి ముందు పెడుతున్నారు.
నాటి నెహ్రూ నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. మరీ ఆ ఎర్రకోటను ఎవరు కట్టారు. విదేశాల నుంచి వచ్చి దేశాన్ని ఆక్రమించుకున్న మొఘల్ చక్రవర్తులు కదా? కట్టింది. మరీ కాకతీయులు.. సన్ ఆఫ్ ద సాయిల్ ఇక్కడ పుట్టిన బిడ్డలు. ఎర్ర కోటను మన వాళ్లు కట్ట లేదని దాన్ని కూల్చి జెండా ఎగుర వేస్తున్నారా? అన్నీ మతిలేని, తలతిక్క పనులు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయడాన్ని తప్పుపడుతున్నారా..? ఇప్పుడు ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు పక్కన పెట్టి పని చేతకాక, అసలు పని వదిలిపెట్టి ఎందుకీ వివాదాలు చెలరేపుతున్నారు.
తెలంగాణ ఉనికి, సోయి, స్పృహ, కళ, చైతన్యాన్ని చంపడానికే రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఇంకొద్ది రోజులైతే అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది. ఒక్కసారైనా జై తెలంగాణ అన్నారా..? తెలంగాణ రాకముందు ఒక గన్ పట్టుకొని కరీంనగర్ వచ్చాడు. చంద్రబాబు బలం చూసుకుని ఉద్యమాన్ని అణచి వేస్తానని విర్రవీగాడు. అది ఇప్పటికీ ఆయన రక్తంలో ఉన్నది. కేసీఆర్ ఆనవాళ్లని తొలగించాలనేది ఒక అంశమైతే తెలంగాణపైనే ఆయనకు వ్యతిరేకత ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. నేను వరంగల్‌లో కూడా ఇదే చెప్పాను. ఇపుడు కరీంనగర్లో ఉండి చెబుతున్నా. కాకతీయ యూనివర్సిటీలో లా చదివిన విద్యార్థిగా చెబుతున్నా. వేసవి సెలవులు ముగియగానే హైకోర్టులో ఈ విషయమై కేసు వేస్తా. ఇలాంటి పనులు కూడా చేయవచ్చా? అని కోర్టును అడుగుతా. కాంగ్రెస్‌ను కూడా అందులో పార్ట్ చేస్తా. దీనిని దేశ వ్యాప్త చర్చకు దారితీసేలా నేను ముందుండి నడిపిస్తా. అంతే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా చిహ్నాలను తొలగించాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తే, మేం అధికారంలోకి వచ్చిన వెంటనే మార్చి పడేస్తాం.