BRS | బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంపై కాంగ్రెస్ దాడిని ఖండిస్తూ.. ఎమ్మెల్యే గాంధీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ సీనియర్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు వాహనాల్లో వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా జులుం ప్రదర్శిస్తున్నారని.. బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు ఉన్న వాహనాన్ని శ్రీశైలం రోడ్డుపైపు మళ్లించారు. కడ్తాల్ మీదుగా కల్వకుర్తికి తరలిస్తున్నట్లు తెలుస్తున్నది. రెండుగంటలుగా బీఆర్ఎస్ నేతలను పోలీసులు రోడ్లపైనే తిప్పుతున్నారు. ఇప్పటికే వంద కిలోమీటర్లకుపైగా వాహనాల్లో తిప్పారు. ఓ వాహనాన్ని తలకొండపల్లి, మరొకటి కేశంపేట వైపు తిప్పారు. తలకొండపల్లి వద్ద ఎమ్మెల్యేలను తరలిస్తున్న వాహనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. కేశంపేట మండలం కొత్తపేట వద్ద వాహనానికి అడ్డుగా బీఆర్ఎస్ శ్రేణులు భైఠాయించాయి. కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.
ఈ సందర్భంగా పోలీసుల తీరుపై హరీశ్‌రావు మండిపడ్డారు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయమన్నామని.. 307 నమోదు చేస్తే స్టేషన్ బెయిల్ ఇలా ఇస్తారని ప్రశ్నించారు. ఏసీపీ, సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పీఎస్‌కు వెళ్తే మమ్మల్ని అరెస్టు చేశారని ఆరోపించారు. అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో తిప్పుతున్నారన్నారు. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదన్నారు. మేం ఏమైనా ఉగ్రవాదులమా? అంటూ ప్రశ్నించారు. మాజీ మంత్రినైనా తనతో ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. నా ఎడమ భుజం బాగా నొప్పి వస్తుందన్నారు. పోలీసులు నా చేతిని బలంగా లాగడంతో నొప్పి పెరిగిందన్నారు. మరో వైపు గచ్చిబౌలి డీసీపీ ఆఫీస్‌కు కౌశిక్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరుకున్నారు. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి సబితా అన్నారు. సీఎం బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాడికి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. అరికెపూడి గాంధీపై హత్యా యత్నం కేసు నమోదు చేయాలన్నారు.