జనగామ, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లి మాజీ సర్పంచ్ ప్రత్యూషరెడ్డి భర్త, బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్‌రెడ్డి సహా మరో ఇద్దరు నాయకులను శనివారం పోలీసులు ముందుస్తుగా అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఐదేండ్ల క్రితం శ్రీపతిపల్లి మాజీ సర్పంచ్ ప్రత్యూషామనోజ్రెడ్డి ఇంట్లో సినిమాషూటింగ్ చేశారు. ఆ సమయంలో గ్రామ దేవతకు రూ.6 లక్షల బంగారు ఆభరణాలు బహూకరిస్తామని కొండా దంపతులు అప్పట్లో హామీ ఇచ్చారు. శుక్రవారం దుర్గామాతకు ఆభరణాలు సమర్పించి మొక్కు చెల్లించుకోవాల్సి ఉండగా వారి పర్యటన రద్దయింది.
స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. కొండా దంపతులను అడ్డుకున్నారని మనోజ్‌రెడ్డి ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది. మాతృవియోగం చెందిన శ్రీపతిపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం కడియం శ్రీహరి గ్రామ పర్యటన ఖరారైంది.
ఈ క్రమంలో కడియంను బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించే అవకాశం ఉన్నదనే సమాచారంతో పోలీసులు మనోజ్‌రెడ్డితోపాటు స్టేషన్‌ఘన్‌పూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రంగు హరీశ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పంగా సురేశ్‌ను ముందుస్తుగా అదుపులోకి తీసుకొని గృహ నిర్బంధం చేశారు. ఆ తర్వాత ఈ ముగ్గురిని రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
మనోజ్‌రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారని, ఆయనకు ఏమైనా హాని జరిగితే కడియం శ్రీహరి బాధ్యత వహించాల్సి వస్తుందని అతని భార్య ప్రత్యూషరెడ్డి మాట్లాడిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు మనోజ్‌రెడ్డి, రంగు హరీశ్, పంగా సురేశ్‌ను చిల్పూ రు పోలీస్‌స్టేషన్‌లో బైండోవర్ చేసి విడుదల చేశారు. కడియం ఒత్తిడితోనే బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తూ గ్రామస్థులు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగడంతో స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది.