Anugula Rakesh Reddy | డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని ఆధారాలను సైతం సేకరించి అభ్యర్థులు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. రిజర్వేషన్ క్యాటగిరీల్లో మొదట 33 మందిని భర్తీ చేసినప్పుడు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన అనేక మంది అభ్యర్థులను కాదని ఎటువంటి ప్రతిభ చూపకుండా దొంగ సర్టిఫికెట్లు పెట్టినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వచ్చినా, ఫిర్యాదులు చేసినా మూడు సార్లు సర్టిఫికెట్లు పరిశీలించి కూడా ఇప్పటికీ ఆ నివేదికను ప్రభుత్వం బయట పెట్టడం లేదని విమర్శించారు.
ఓపెన్ క్యాటగిరీలో ఉన్న 63 మందిని ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రతి రోజు అభ్యర్థులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా ప్రదక్షిణాలు చేస్తున్నా కనీసం సమాధానం చెప్పేటోడే లేడని ఏనుగుల రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. ఒకవైపు గ్రూప్ 1 ఫలితాల్లో గోల్ మాల్ మరోవైపు డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవినీతి.. ఏంది ఈ ఘోరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల దగ్గర 20 పర్సంటేజ్, పెన్షనర్ల దగ్గర పర్సంటేజ్, పర్మిషన్ కి పెమెంట్స్, పథకాల వర్తింపు కోసం పైసలు, ఉద్యోగాల భర్తీలో డబ్బులు చేతులు మారడం… ఇలా కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని మరోసారి రుజువు చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై విచారణ చేపట్టి వాస్తవాలను తేల్చాలని అన్నారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్ని తక్షణమే భర్తీ చేయాలని.. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.