HCU | హెచ్సీయూ ఉద్రిక్తతలపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి స్పందించారు. భారతీయుల ఆత్మ గౌరవ ప్రతీక ఆయిన జాతీయ పక్షి నెమలిని చంపడం దారుణమని అన్నారు. రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి జాతీయ ఉన్నత్యాన్ని భారత దేశ సమగ్రతను కాపాడుతానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి సాక్షాత్తు 130 కోట్ల ప్రజల ఆత్మగౌరవ ప్రతికైన జాతీయ పక్షి నెమలిని అత్యంత క్రూరంగా అర్ధరాత్రి అధికారికంగా హత్యలు చేయడం అత్యంత పాశవికమని మండిపడ్డారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని విమర్శించారు.
సమైక్య పాలనలో సైతం, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో లేని నిర్బంధాలను కేవలం 15 నెలల పాలనలో ఉస్మానియాలో విద్యార్థి సంఘాలు అడుగుపెట్టకూడదని సభలు సమావేశాలకు అనుమతి తప్పనిసరి అని ఎమర్జెన్సీని పోలిన నిబంధనలు తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలంగాణలో ఈ యూనివర్శిటీ భూముల దోపిడీ, నెమళ్ల హత్య విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సీనియర్ ఐపీఎస్ అధికారి, సిట్టింగ్ జార్జ్ తో స్వతంత్య్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భారత దేశానికి ప్రధాని కావాలని కలలు కంటున్న రాహుల్ గాంధీ జాతీయ పక్షి హింస విషయంలో, యూనివర్శిటీ భూముల అంశంలో స్పందించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ కి విశ్వవిద్యాలయాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, దేశం పట్ల జాతీయ పక్షి పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా, దేశభక్తి ఉన్నా రేవంత్ రెడ్డిని తక్షణమే ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సర్వేలు చేసి, కన్నేసి పెట్టిన భూములను ఇప్పుడు సీఎం కాగానే కాజేస్తున్నాడని మండిపడ్డారు. హెచ్సీయూలో గతంలో ఫుట్బాల్ ఆడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే భూములనే ఖతం పట్టిస్తున్నాడని అన్నారు. సాక్షాత్తు జాతీయ పక్షే, జాతి సంపద అయిన యూనివర్శిటీ భూముల దోపిడీకి అడ్డం నిలిచి కాపాడే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కానీ, ఆ నెమళ్లను సైతం రేవంత్ రెడ్డి తమ బుల్డోజర్ల కింద తొక్కి కిరాతకంగా హత్య చేస్తున్నట్టు అనుమానంగా ఉందని పేర్కొన్నారు. తన భూ దాహం వల్ల ఉన్న ఊరులో ఛీకొట్టించుకున్నా సిగ్గు రాకపోతే ఇంకేం లాభమని మండిపడ్డారు. ఇప్పుడు పిల్లలు చదువుకునే యూనివర్శిటీ భూముల మీద పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యా వ్యవస్థను ఉద్ధరిస్తా అని ఉద్దెర ముచ్చట్లు చెప్పి, అన్ని విద్యాలయాలను అమ్మేసే కుట్రకు తెర లేపాడని రేవంత్ రెడ్డిని ఏనుగుల రాకేశ్ రెడ్డి విమర్శించారు. అందులో భాగంగానే ఉస్మానియా యూనివర్శిటీలో రోజుకో దొంగ సర్క్యూలర్ జారీ చేస్తూ, ప్రశ్నించే వాళ్లకు స్థానం లేకుండా చేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా హెచ్సీయూ భూములను అమ్మేసే పన్నాగం పన్నుతున్నారని ఆరోపించారు. సిగ్గులేదానే జీడిగింజ అంటే నల్లగా ఉన్నా నాకేం సిగ్గు అన్నట్టు, సాక్షాత్తు ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్ గా వ్యవహరిస్తున్నాడని అన్నారు. ఇది దేశ భవిష్యత్ కు సంబంధించిన విషయమని అన్నారు.
విశ్వవిద్యాలయాలు దేశ భవిష్యత్ నిర్మాణ కర్మాగారాలు అని పేర్కొన్నారు. మేధావులను, బుద్ధిజీవులను తయారు చేసి దేశానికి అందించే గొప్ప సంస్కార కేంద్రాలు అలాంటి విద్యాలయాల జోలికి పోయి తన పతనం తానే కొని తెచ్చుకుంటున్నాడని రాకేశ్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ దీనిపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ పాలన తేవడమే మీ లక్ష్యమా అని నిలదీశారు.
140 కోట్ల భారతీయుల ఆత్మ గౌరవ ప్రతీక ఆయిన జాతీయ పక్షి నెమలిని హింసించడం, చంపడం దారుణం.
రేవంత్ రెడ్డి @revanth_anumula గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. తక్షణమే రాజీనామా చెయ్యాలి.
తక్షణమే రేవంత్ రెడ్డి గారి పై దేశద్రోహం కేసు పెట్టాలి.
ఆఖరికి తన భూ దాహానికి విశ్వవిద్యాలయాలు కూడా… pic.twitter.com/KuZnH6wBYa
— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) March 31, 2025
హెచ్సీయూ వివాదమేంటంటే..
కంచె గచ్చిబౌలిలోని హెచ్సీయూ సమీపంలో ఉన్న 400 ఎకరాల భూమిని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మేయాలని ఇటీవల నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని చదును చేసేందుకు వచ్చిన అధికారులను హెచ్సీయూ విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ 400 ఎకరాల భూమి తమ యూనివర్సిటీకే చెందుతుందని విద్యార్థులు చెప్పుకొచ్చారు. అయితే ఆ భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఐసీ తాజాగా స్పష్టం చేసింది. ఆ భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా ప్రభుత్వం నిరూపించుకుందని తెలిపింది. ప్రైవేటు సంస్థకు 21 ఏండ్ల క్రితం కేటాయించిన భూమిని దక్కించికుందని పేర్కొంది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవన్నారు. సర్వేలో ఒక అంగుళం భూమి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలిందని చెప్పింది. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక ఇక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదని స్పష్టం చేసింది.
కాగా, టీజీఐఐసీ ప్రకటనను హెచ్సీయూ రిజిస్ట్రార్ ఖండించారు. 2024 జూలై అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని స్పష్టంచేశారు. ఇప్పటివరకు భూమి ఎలా ఉందనే దానిపై ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని వివరించారు. భూ హద్దులను హెచ్సీయూ అంగీకరించినట్లు టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని రిజిస్ట్రార్ తెలిపారు. ఇప్పటివరకు భూమి సరిహద్దులను గుర్తించలేదని తెలిపారు. దీనిపై హెచ్సీయూకి సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఆ భూమిని వర్సిటీకే ఇవ్వాలని చాలా కాలంగా కోరుతున్నామని పేర్కొన్నారు. భూమిని కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్ని కోరుతామని అన్నారు.