మాజీ మంత్రి హరీశ్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన చిల్లర విమర్శలపై ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖండించారు. అడుగడుగునా తెలంగాణ రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో డిసెంబర్ 9 నాడు ఏకకాలంలో రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి తరువాత ఆగష్టు 15 వరకు చేస్తామని రైతులని మోసం చేశాడని విమర్శించారు.
మూడు విడతల్లో కలిపి రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 23.75 లక్షలు మాత్రమేనని అనిల్ కూర్మాచలం అన్నారు. దీనివల్ల దాదాపు 46.25 లక్షల రైతులు రుణమాఫీకి నోచుకోలేకపోతున్నారని అన్నారు. నాడు బీఆర్ఎస్ లక్ష రుణమాఫీకి 36.68 లక్షల మంది అర్హులు ఉంటే, నేడు కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీకి 23.75 లక్షల మందే అంటున్నారని, బీఆర్ఎస్ హయాం కన్నా 13 లక్షల మంది అర్హులు తగ్గారని తెలిపారు. రుణమాఫీ పరిమితి పెంచితే అర్హుల సంఖ్య పెరగాలని..
ఇలా రైతుల్ని మోసం చేయడమే కాకుండా, ప్రశ్నించి సవాలు విసిరిన మాజీ మంత్రి హరీశ్ రావుపై అనుచిత వాఖ్యలు చేయడం సీఎం రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు.
హరీశ్ రావు లాంటి నాయకుడు దేశంలోనే చాలా అరుదుగా ఉంటారని అనిల్ కూర్మాచలం తెలిపారు. రాజీనామాలు పదవులు హరీశ్‌కు కొత్త కాదని అన్నారు. దమ్ముంటే రైతులకి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి సవాల్ స్వీకరించాలని అంతే కానీ మాటల గారడీ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తామనుకుంటే అది మీ అవివేకమవుతుందని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని అనిల్ కూర్మాచలం తెలిపారు.