హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ విభాగం(ఏఐసీసీ) అవలంబిస్తున్న విదేశాంగ విధానాలకు, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు అస్సలు పొంతనలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దా సోజు శ్రవణ్ విమర్శించారు. ఢిల్లీలో ట్రంప్‌ను జాతీయ శత్రువుగా ఏఐసీసీ తిట్టిపోస్తుంటే, హై దరాబాద్‌లోని తెలంగాణ ఫ్రాంచైజీ మాత్రం ఆయనను దేవుడిలా ఎలా పూజిస్తుంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ద్వంద్వ నీతిని ఎండగడుతూ సోమవారం ఆయన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి బహిరంగ లేఖ రాశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను చిన్నచూపు చూస్తున్నారని, మోదీ ప్రభుత్వం అమెరికా ముందు మోకరిల్లి దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టిందని ఈ నెల 20న ఏఐసీసీ ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారని చెప్పారు. కానీ, దానికి విరుద్ధంగా ఈ నెల 23న హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో తెలంగాణ ప్రభుత్వం ‘డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ’ను ప్రారంభించడానికి ఎలా రెడ్‌కార్పెట్ పరుస్తున్నదని నిలదీశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకే విధమైన నిర్దిష్ట సిద్ధాంతం ఉన్న రాజకీయ పార్టీనా? లేక ఏఐసీసీ నియంత్రణకు లోబడకుండా రాష్ట్రానికో విధంగా నడిచే ‘ప్రైవేట్ ఫ్రాంచైజీ’నా? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ఢిల్లీలో రాజ్యాంగ నైతికత గురించి ప్రవచిస్తుంటే, ఆ పార్టీ ముఖ్యమంత్రి మాత్రం హైదరాబాద్‌లో నిరంకుశపాలన సాగిస్తూ, హిట్లర్ శైలిని అవలంబిస్తూ, తెలంగాణలో బుల్డోజర్ రాజ్యాన్ని నడుపుతున్నారని ఆక్షేపించారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలకే ద్రోహం
దేశాన్ని అవమానించే వ్యక్తి పేరుతో రోడ్డు ను ప్రారంభించడం కాంగ్రెస్ సిద్ధాంతాలకు ద్రోహం చేయడమేనని డాక్టర్ దాసోజు మండిపడ్డారు. ఢిల్లీ నినాదాలకు, హైదరాబాద్ రోడ్డు నాటకాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రశ్నించారు. ట్రంప్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? అని నిలదీశారు. ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ రాజ్యాన్ని రాహుల్‌గాంధీ ఖం డిస్తుంటే, తెలంగాణలో మాత్రం రేవంత్‌రెడ్డి కూల్చివేతల సంస్కృతిని, హిట్లర్ పాలనను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ‘అసలైన కాంగ్రెస్ ఏది? ఢిల్లీలో సార్వభౌమాధికారం గురించి మాట్లాడేదా? లేక తెలంగాణ వీధుల్లో లొంగిపోయేదా? దీనిపై రాహుల్‌గాంధీ తక్షణమే స్పందించి, ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని దాసోజు డిమాండ్ చేశారు.
‘కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టొద్దు’
అమెరికా కాన్సులేట్ సమీప రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు పెట్టవద్దని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ సోమవారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేదర్ విగ్రహం వద్ద నిరసన ర్యాలీ తీశారు. ట్రంప్ పేరును ఎందుకు పెట్టాలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.