గజ్వేల్, సెప్టెంబర్ 17: సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్‌లో 70ఎకరాల భూమి ఉన్నదని, కూతురు పేరుతో హైదరాబాద్ చుట్టూ 50 మోడల్ జూనియర్ కళాశాలలను కట్టిస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు అతడి కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న భూములను ప్రకటిస్తే స్వాగతిస్తామని, దమ్ముంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధ్దాలు మాట్లాడారని, కేసీఆర్ కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. సర్వేనంబర్ 325లో 388.10 ఎకరాలు, వెంకటాపూర్‌లో 127లో 150 ఎకరాలు కబ్జా చేశారని, కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని సీఎం రేవంత్ పచ్చి అబద్ధ్దాలు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.