హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ పార్టీ ఫిరాయించలేదంటూ బుకాయిస్తున్నారని బీఆర్ఎస్ తరపు న్యాయవాది, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. అనంతరం సోమాభరత్ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, గద్వా ల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగినట్టు తెలిపారు. ఇప్పటివరకు రావాల్సిన అనేక నిజాలు బయటకు వచ్చాయని చెప్పారు. అయినా పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు అబద్ధాలను ఆయుధంగా చేసుకొని మాట్లాడున్నారని విమర్శించారు. ఏది అడిగినా చెప్పేందుకు నిరాకరిస్తున్నారని తెలిపారు. రాజీనామాలు చేసి కాంగ్రెస్‌లోకి వెళ్తే అభ్యంతరం లేదని, ఇలా చట్టాలను తుంగలో తొకొద్దని హితవు పలికారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రజలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. వారు క్రాస్ ఎగ్జామినేషన్ ఎదుర్కోవడంపై ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక శిక్షణ ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన ప్రోసీడింగ్స్ అన్నీ ఎవిడెన్స్, క్రాస్ ఎగ్జామినేషన్పైనే జరిగాయని సోమాభరత్ తెలిపారు. ఇంకా అనేక మంది సాక్షులను విచారణకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదన్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బార్బడోస్‌లో జరిగే స్పీకర్ల సమావేశానికి వెళ్తున్నారని, అందుకే తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేశారని తెలిపారు.