Lasya Nanditha | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో సాయన్న కుటుంబంలోని మరణాలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. ఎమ్మెల్యే లాస్యనందిత తండ్రి సాయన్న నిరుడు ఫిబ్రవరి 19న అకాల మరణం చెందారు. ఆయన మొదటి వర్ధంతి గడిచిన నాలుగు రోజులకే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఏడాదికే తండ్రీ కూతురు ఈ లోకాన్నీ వీడిపోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. కాలం పగబట్టినట్టుగానే సాయన్న కుటుంబాన్ని ఫిబ్రవరి మాసం వెంటాడి ఆ ఇంట ఇద్దరిని కబలించింది. లాస్యనందితను ఎమ్మెల్యే అయిన మూడు నెలల్లోనే మృత్యువు వెంటాడింది.
ఇప్పటికే రెండుసార్లు జరిగిన ప్రమాదాల్లో తప్పించుకున్న లాస్యనందిత మూడోసారి తరుముకొచ్చిన గండం నుంచి తప్పించుకోలేకపోయారు. తండ్రీబిడ్డలు రాజకీయాల్లో అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా సాయన్న చెరగని ముద్ర వేసుకోగా.. చిన్న వయసులోనే కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యేగా గెలిచి లాస్యనందిత ప్రజల మనసు గెలుచుకున్నారు. వీరిద్దరూ ప్రజలతో నిత్యం మమేకమై అనేక సమస్యలను పరిష్కరించి, మృధుస్వభావిగా మంచిపేరు తెచ్చుకున్నారు. కులమతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే ఈ ఇద్దరు ఆదర్శవంతమైన వ్యక్తులుగా ప్రశంసలు అందుకున్నారు. సాయన్నకు ముగ్గురు కూతుళ్లలో చిన్న కూతురైన లాస్య నందిత అంటే అమితమైన ప్రేమ. చిన్నప్పటి నుంచీ ఆమెను అతి గారాబంగా పెంచారు. ప్రజాజీవితంలో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న లాస్యనందిత చిన్న వయసులోనే అనంతలోకాలకు వెళ్లడం నిజంగా విధి ఆడిన క్రూర నాటకమే.
1987లో హైదరాబాద్‌లో జన్మించిన లాస్యనందిత కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. తండ్రి చాటు బిడ్డగా కాకుండా తండ్రికి తగిన బిడ్డగా నిరూపించుకున్నారు. ఆమె 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2016లో సాయన్నతోపాటు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆమె 2016-2020 మధ్య కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి ఓటమి పాలయ్యారు. 2023లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గణేశ్‌పై 17,169 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్ ఉంటుందని భావిస్తున్న తరుణంలో.. చిన్న వయసులోనే లాస్య ఇలా దుర్మరణం చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తంచేస్తున్నారు. ఏడాదికే ప్రజాప్రతినిధుల హోదాలోనే తండ్రీకూతురు మృతి చెందడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.