మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 7: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన లేబర్ కోడ్లపై బీఆర్ఎస్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. ఆదివారం మెదక్‌లో నిర్వహించిన సీఐటీయూ 5వ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథులుగా సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమలతతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. వంద సంవత్సరాల క్రితం కార్మికులు సాధించుకున్న హక్కులను కేంద్రం తుంగలో తొక్కి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని విమర్శించారు. కార్మికవర్గాన్ని, కార్మిక సంఘాలను బలహీనపర్చడం కోసం కేంద్రం కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో 8 నుంచి 12 గంటల పాటు పనులు చేయిస్తూ కార్మికుల శ్రమ దోచుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడుదామనడం, కార్మిక లోకానికి అండగా ఉంటామని చెప్పడం సంతోషకరమని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధ్ది ఉంటే లేబర్ కోడ్లు అమలు కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నేటి నుంచి నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు కార్మికరంగ ప్రతినిధులును ఎందుకు ఆహ్వానించలేదని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది సమ్మె చేశారని గుర్తుచేశారు. సీఐటీయూ నాయకులు మల్లికార్జున్, సాయిబాబా, వీరయ్య, భాస్కర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం 2019లో లేబర్ కోడ్ చట్టం తెచ్చినా నేటివరకు అమలుకు నోచుకోలేదని, ఇది ఒకరకంగా కార్మిక రంగం విజయమేనని స్పష్టం చేశారు. 4 లేబర్ కోడ్లను కేంద్రం వెనక్కి తీసుకునేంత వరకు కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. మహాసభ ప్రారంభానికి ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.