నడిగడ్డ మీద గులాబీ దళం గర్జించింది. తేరు మైదానం జన సందోహంతో శిగమూగింది. పట్టణ శివారునుంచి సభాస్థలి దాకా సాగిన ర్యాలీ జైత్రయాత్రను తలపించింది. సభలో ఉద్వేగభరితంగా సాగిన కేటీఆర్ ప్రసంగం పిడుగుల వర్షం కురిపిస్తే .. సభలో జనం చప్పట్ల జడివానలో తడిసిముద్దయ్యారు. ప్రధానంగా గద్వాల అభివృద్ధికి తాము ఏం చేశామో వివరిస్తూ.. మరోవైపు కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం ఎలా మోసపోయిందో విడమర్చి చెప్పిన తీరు జనంలో ఊపు తెచ్చింది. ప్రశ్నలు వేసి ప్రజల నుంచి జవాబులు రాబట్టిన తీరు.. జోష్‌ను తారస్థాయికి తీసుకువెళ్లింది. గంటన్నర పాటు ఉర్రూతలూగించిన ప్రసంగానికి క్లయిమాక్స్‌గా ‘దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలి’ అని చేసిన సవాల్‌తో గద్వాల దద్దరిల్లింది.
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన భాషలో చెప్తేనే అర్థమయితది. అయినా అట్లాంటి భాష మనం మాట్లాడలేం. కానీ, తప్పదు.. ఆయన కోసం మాట్లాడాలి. రేవంత్ నువ్వు మొగోడివైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. ఉప ఎన్నికలకు పోదాం. బై ఎలక్షన్లలో చూసుకుందాం. పదేండ్ల కేసీఆర్ పాలన, రెండేండ్ల కాంగ్రెస్ పాలన.. ఏది బాగుందో తేల్చుకుందాం. ఉప ఎన్నికల్లో దమ్ముంటే గెలిచి చూపించు’ అంటూ గద్వాల తేరు మైదానం నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
శనివారం గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గద్వాల గర్జన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలను తుంగలో తొక్కి వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మార్చిన ఎమ్మెల్యేలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. పార్టీలు మారిన ఆ పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా ఉన్నదని, అసలు వారు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
స్వార్థం కోసం, ఆస్తులు పెంచుకునేందుకు అవకాశవాదంతో వారు పార్టీలు మారారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా తీసుకున్నదని చెప్పారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని, వారికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాబోయే ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండమని అన్నారు.
కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత కూడా ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గద్వాల బీఆర్ఎస్ సభలో వేలాదిమంది ఉంటే, బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పుకుంటున్న గద్వాల ఎమ్మెల్యే మాత్రం రేవంత్‌రెడ్డితో ఉన్నారని పేర్కొన్నారు. ఎవరి అభివృద్ధి కోసం కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లాడని ప్రశ్నించారు. పేదల కోసమైతే ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని, రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ మాయమైందని నిలదీశారు. ఆడబిడ్డలకు స్కూటీ ఎక్కడ ఇచ్చారని, 20 లక్షల దళితబంధు ఎక్కడని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీ ఏమైందని నిలదీశారు.
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి పార్టీ మారిండా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని, గ్రూప్-1 ఉద్యోగాలను కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రజలు నమ్మి ఓటేసి, ఇప్పుడు మోసపోతున్నారని, ఇందుకే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిండా? అని ప్రశ్నించారు. గద్వాల ఎమ్మెల్యే గతంలో చెప్పిన మాటలపై కూడా కేటీఆర్ విరుచుకుపడ్డారు. ‘కాంగ్రెస్‌లో చేరబోనని, చేరాల్సి వస్తే రైలుకింద తలపెడతానని చెప్పిన ఎమ్మెల్యే ఈ సభకు ఎందుకు రాలేదు? బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పుకుంటూ కాంగ్రెస్‌కు లొంగిపోవడం ప్రజలను మోసం చేయడమే’ అని ఆయన ధ్వజమెత్తారు.
బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చిన తెలంగాణను కాంగ్రెస్ పాడు చేసింది. అసమర్థ కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి నిరుద్యోగుల వరకు అన్ని వర్గాలు బాధ పడుతున్నాయి. విద్య నుంచి సంక్షేమం వరకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది.
-కేటీఆర్
‘రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మళ్లీ యూరియా కష్టాలు, కరెంటు కోతలు మొదలయ్యాయి. కరోనా సమయంలో కూడా రైతుబంధు వేసిన ఘనత కేసీఆర్‌ది. అన్ని పథకాలను కష్టకాలంలో కూడా అమలు చేసిన ఘనత ఆయనదే. బంగారు పళ్లెంలో పెట్టి ఇచ్చిన తెలంగాణను కాంగ్రెస్ పాడు చేసింది. అసమర్థ కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి నిరుద్యోగుల వరకు అన్ని వర్గాలు బాధ పడుతున్నాయి. విద్య నుంచి సంక్షేమం వరకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది’ అని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి అప్పుడెలా ఉందో? ఇప్పుడెలా ఉందో అందరికీ తెలిసిందేనని అన్నారు. కాంగ్రెస్ మోసం తప్ప మరేం చేయలేదని మండిపడ్డారు. మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గద్వాల మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.
‘తెలంగాణ ఉద్యమంలో గద్వాల ముందు వరుసలో నిలిచింది. జోగులాంబ తల్లి ఆశీస్సులతో గద్వాల జిల్లాగా మారింది. గద్వాలను జిల్లా కేంద్రంగా మార్చడమే కాకుండా మెడికల్ కాలేజీ కూడా తెచ్చాం. తుమ్మిళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 18.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. 22 నెలలైనా ఇప్పటి దాకా నిర్మాణ పనులను కొనసాగించకుండా గట్టు ప్రాజెక్టును పండబెట్టింది కాంగ్రెస్ అని గుర్తుంచుకోండి’ అని కేటీఆర్ విమర్శించారు. గద్వాల బహిరంగ సభ సందర్భంగా భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. వర్షంలోనూ భారీగా తరలివచ్చిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చే ఎన్నికల్లో గద్వాలలో ఎమ్మెల్యేను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
తాను గద్వాలకు వస్తుంటే ఒక కాంగ్రెస్ నాయకుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావని అడుగుతున్నాడని, మనకి ముఖం లేదా ఇక్కడికి రావడానికి అని ప్రశ్నించారు. గద్వాలను జిల్లా చేసి, మెడికల్ కాలేజీ ఇచ్చి, రెండు ఎత్తిపోతలతో లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే ఇవాళ మరో 10 లక్షలు కలిపి మరో 18 లక్షల ఎకరాలు ఉమ్మడి జిల్లాలో సాగువుతున్నదని, ఇది కేసీఆర్ నాయకత్వంలో కాదా? అని ప్రశ్నించారు. ఇవాళ డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని రూ. 3 కోట్లకు అమ్ముకున్నట్టు వార్తలు వస్తున్నాయని, 563 ఉద్యోగాలు అమ్ముకుని రూ. 1700 కోట్లు దండుకున్నట్టు నిరుద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో చేరబోనని, చేరాల్సి వస్తే రైలుకింద తలపెడతానని చెప్పిన ఎమ్మెల్యే ఈ సభకు ఎందుకు రాలేదు? బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పుకుంటూ కాంగ్రెస్‌కు లొంగిపోవడం ప్రజలను మోసం చేయడమే.
-కేటీఆర్
గద్వాల జిల్లా కేంద్రంలో కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ సమక్షంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్‌తోపాటు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యూసుఫ్, మాజీ జెడ్పీటీసీ పద్మా వెంకటేశ్వరరెడ్డి, మాజీ కౌన్సిలర్లు జయలక్ష్మి, అరుణ, లక్ష్మి, రంజిత్, జయమ్మ, మహేశ్, జమన్సింగ్, రామచంద్రుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అమరవాయి కృష్ణారెడ్డి, ప్రతాప్, మాజీ ఉపసర్పంచులు వెంకటేశ్, గోకారి, గోవిందు, ఆశన్న తదితరులు చేరారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ లైసెన్స్ రద్దు చేయాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలంపూర్‌లోని రాజోలి మండలం పెద్దగానివాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం రైతులను తీసుకుపోయి 15 రోజులు జైల్లో పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారని కేటీఆర్ తెలిపారు. వాళ్లకు అండగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు మహబూబ్‌నగర్ జైలుకు, కోర్టుకు వెళ్లి రైతులను విడిపించి తీసుకువచ్చారని తెలిపారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇట్లాగే ప్రజలు ఆందోళన చేస్తే అక్కడ పర్మిషన్లు రద్దు చేశారని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వానికి నడిగడ్డ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే ఆ ఫ్యాక్టరీ లైసెన్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతన్నలకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్పై జనం అభిమానం ఉందనడానికి గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన గద్వాల గర్జన సజీవ సాక్షంగా నిలిచింది.. ఒకవైపు వర్షం పడుతున్నా కేటీఆర్ రాక కోసం జనం ఎదురు చూశారు. అంతకుముందు ఎర్రవల్లి చౌరస్తా నుంచి గద్వాల వరకు గులాబీ జెండాలతో పట్టణం జనసంద్రంగా మారింది. భారీ కాన్వాయ్‌తో కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో వర్షంలో సైతం ‘జై కేసీఆర్’, ‘జై కేటీఆర్’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఇంతియాజ్, ఆంజనేయగౌడ్, రజిని, నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు, శ్యామల, విజయ్‌కుమార్, పల్లయ్యలు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత కూడా ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు. గద్వాల బీఆర్ఎస్ సభలో వేలాదిమంది ఉంటే, బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పుకుంటున్న గద్వాల ఎమ్మెల్యే మాత్రం రేవంత్‌రెడ్డితో ఉన్నారు.
-కేటీఆర్
గద్వాల తేరు మైదానంలో జరిగిన గద్వాల గర్జన బహిరంగ సభలో తల్వార్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేత విజయ్‌కుమార్.. బహిరంగ సభకు పెద్ద ఎత్తున హాజరైన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు
బస్సులో వెళ్తూ తమ అభిమాన నేత కేటీఆర్‌ను చూసిన ఆనందంలో ప్రయాణికులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ర్యాలీని ఆసక్తిగా తిలకిస్తున్న విద్యార్థులు
కేటీఆర్‌ను చూసిన సంబురంలో చేయి ఊపుతున్న రైతులు