Telangana | హైదరాబాద్ : తెలంగాణ మోడల్ మహారాష్ట్ర( Maharashtra )కు అవశ్యమని, దీనిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మహారాష్ట్ర ప్రజాప్రతినిధులకు బీఆర్ఎస్( BRS Party ) కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం( Manik Kadam ) సవాల్ విసిరారు.
ప్రస్తుతం మహారాష్ట్రలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ప్రజలను ఓటు వేసే యంత్రాలుగా చూస్తున్నారే తప్ప ఆ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు తక్షణ విరుగుడు తెలంగాణ మోడల్ అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అన్ని రంగాలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయని శుక్రవారం మాణిక్ కదం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ దేశ వ్యవసాయ రంగానికి ముఖచిత్రంగా మారిందని ఆయన పేర్కొన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు సాగునీటి కష్టాలను కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిందన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై చర్చించటానికి మహారాష్ట్రలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బహిరంగ చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. బహిరంగ చర్చకు రావటానికి వీలుకాకపోతే ప్రజాప్రతినిధుల క్షేత్ర పర్యటన సందర్భంగా బస చేసే ఖరీదైన హోటళ్లల్లో అయినా చర్చకు రావాలని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రకు తెలంగాణ మోడల్ అవశ్యమని ఈ విషయంలో ఎక్కడంటే అక్కడ చర్చకు తాను సిద్ధమని ఆయన తేల్చిచెప్పారు. మహారాష్ట్రలోని అధికార బీజేపీ నేతలు సహా ఎవ్వరైనా తెలంగాణ వ్యవసాయ విధానాలను అధ్యయనం చేసి రావచ్చని, తెలంగాణాలో క్షేత్ర స్థాయిలో చూసిన తర్వాత మాట్లాడాలని హితవు చెప్పారు.