హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): గురువారం జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజికవర్గం మద్దతును ప్రకటించింది. తమ సామాజికవర్గం అభ్యున్నతికి కృషి చేసిన బీఆర్ఎస్ సర్కారును యాది పెట్టుకుంటామని, సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తామని ఆయా సంఘాల నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యమకాలంలోనూ కాపులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటే నడిచారు. 2018 అసెంబ్లీ, జీహెచ్ఎంసీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాపులు బీఆర్ఎస్ పార్టీకే మద్దతుగా నిలిచారు.
ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ఆయా సామాజికవర్గాల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకున్నది. దక్షిణ భారత కాపు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఖానామెట్‌లో కోట్లాది రూపాయల విలువ చేసే 7 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. లోయర్ ట్యాంక్‌బండ్‌లో కాపు భవన్ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసింది. బీహెచ్ఈఎల్ సమీపంలో 2 వేల గజాల స్థలాన్ని కమ్యూనిటీ హాలు నిర్మాణానికి కేటాయించింది. కుత్బుల్లాపూర్‌లో కళ్యాణ మండపానికి స్థలం, వనస్థలిపురంలో వంగవీటి రంగా విగ్రహం ఏర్పాటు వంటి హామీల నేపథ్యంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజికవర్గమంతా బీఆర్ఎస్ పార్టీకి సహకరించాలని సంఘం నేతలు పిలుపునిచ్చారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పెద్ద సంఖ్యలో గల ఓటర్లంతా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు.