హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష అని బ్రిటన్‌లోని బీఆర్ఎస్ ఎన్నారై యూకే విభాగం నాయకులు పేర్కొన్నారు. మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. లండన్‌లోని రీడింగ్ పట్టణంలో బీఆర్ఎస్ ఎన్నారై యూకే కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. పార్టీ రీడింగ్ పట్టణ ఇన్చార్జి, బీఆర్ఎస్ ఎన్నారై యూకే విభాగం కార్యదర్శి మల్లారెడ్డి బీరం అధ్యక్షతన ఈ కార్యక్రమం జరింగింది. ఈ సందర్భంగా ఆ విభాగం ఉపాధ్యక్షుడు నవీన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో మొదటిసారి ఖండాంతరాల్లో లండన్ గడ్డపై గులా బీ జెండాను ఎగురవేశామని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారధ్యమే రాష్ర్టానికి ప్రయోజనం అని ఆనాడు తాము విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడూ, ఇప్పుడూ తెలంగాణ ప్రయోజనాల కోసం కట్టుబడి చిత్తశుద్ధితో పోరాటం చేసే సత్తా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు మాత్రమే ఉన్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ గెలుపు.. ప్రజల గెలుపే అవుతుందని చెప్పారు. కేసీఆర్ నాయత్వానికి బలం ఇస్తేనే తెలంగాణకు మేలు జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్నారై యూకే విభాగం ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్‌రెడ్డి, అధికార ప్రతినిధులు హరిగౌడ్ నవాబుపేట్, రవికుమార్ రత్తినేని, రవిప్రదీప్ పులుసు, సురేశ్ బుడగం, సత్య చిలుముల, సతీశ్‌రెడ్డి బండ, సత్యపాల్‌రెడ్డి పింగిళి, శ్రీకాంత్ జెల్ల, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.