KTR | హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఫార్ములా ఈ-రేస్ కేసుకన్నా ముందే అవకాశం దొరికితే ఆయనను అరెస్టు చేయాలనే ప్రయత్నాలు అనేకం జరిగాయి. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కేటీఆర్ సారధ్యంలో కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఒత్తిడి చేస్తున్నది.
ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన ప్రతిసారీ, ప్రజల్లో సరార్‌పై అసమ్మతి పెరిగిన సందర్భాల్లో కేటీఆర్‌ను టార్గెట్‌గా చేసుకొని ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తెస్తున్నారని, వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకొని మంత్రులు విమర్శలు చేస్తున్నారని, సంబంధం లేని అంశాల్లో కేటీఆర్ ప్రమేయం ఉన్నదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో తప్పుడు ఆరోపణలు, ప్రచారాలు చేస్తున్నారని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరు గ్యారెంటీలపై అడిగితే అరడజనుసార్లు కేటీఆర్‌ను కేసుల్లో ఇరికించాలని సర్కార్ కత్తిగట్టిందని బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఎక్కడా ఏమీ దొరక్కపోయేసరికి బ్యాంకు టు బ్యాంకు అదీ ప్రభుత్వంగా చేసిన లావాదేవీలను బూచిగా చూపి అవినీతికి ఆస్కారంలేని కేసని తెలిసినా కేటీఆర్‌ను ఉద్దేశపూర్వకంగా ఇరికించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కేటీఆర్ టార్గెట్‌గా జరిగిన పరిణామాలను చూస్తుంటే ప్రభుత్వానికి ప్రత్యేకించి సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌పై కక్షసాధింపు పంతం ఏ స్థాయిలో ఉన్నదో స్పష్టమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు.
జన్వాడ ఫామ్‌హౌస్..
జన్వాడ ఫామ్‌హౌస్‌పై అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచీ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నది. ఫామ్‌హౌస్ తనది కాదని కేటీఆర్ వివరణ ఇచ్చినా వినలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దుష్ప్రచారం కొనసాగించింది. నిరుడు ఆగస్టులో ఇరిగేషన్ అధికారులు ఫామ్‌హౌస్ వద్ద కొలతలు వేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదంటూ హడావుడి చేశారు. ‘కేటీఆర్‌కు చెందిన ఫాంహౌస్‌లో కూల్చివేతలు’ అంటూ మీడియా సైతం హడావుడి చేసింది. అయితే, ఆ ఫామ్‌హౌస్ తనది కాదని, తన స్నేహితుడిదని, ఒకవేళ అది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోచ్చని కేటీఆర్ మీడియా సమావేశంలో ప్రకటించారు.
కుటుంబ దావత్‌కు రేవ్‌పార్టీ ముసుగు
జన్వాడలోని కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో నిరుడు అక్టోబర్‌లో ఓ శుభకార్యం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వపెద్దల ప్రోద్బలంతో దాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి పోలీసులు దాడులు చేశారు. డ్రగ్స్, విదేశీ మద్యం దొరికాయని హడావుడి చేశారు. చివరికి ఫ్యామిలీ ఫంక్షన్ అని తేలడంతో ప్రభుత్వం తెల్లముఖం వేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో..
ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సంబంధం లేదని, అవసరమైతే నారో టెస్ట్‌కు రెడీ అని కేటీఆర్ వెల్లడించారు. తనపై నిత్యం ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తనతోపాటు లైడిటెక్టర్, నారో అనాలసిస్ పరీక్షకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సంబంధం లేదని కేటీఆర్ పదేపదే స్పష్టం చేసినా సర్కారు శతవిధాలా ఆయనను ఇరికించాలని చూసింది. సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు తన ఫోన్‌ను, ఇతర ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని కేటీఆర్ బహిరంగంగానే ఆరోపించారు. ట్యాప్ చేయడం లేదని చెప్పే దమ్ము, ధైర్యం సీఎం రేవంత్‌రెడ్డికి లేదని తేల్చిచెప్పారు.
సోషల్ మీడియా వేదికగా
కాంగ్రెస్ తమ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో కేటీఆర్‌పై తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నదని బీఆర్ఎస్ మండిపడతున్నది. పార్టీ కార్యక్రమం కోసమో, ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకో ఢిల్లీకి వెళ్లినా ‘కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ పెద్దలను కలుస్తున్నారు’ అంటూ ప్రచారం చేశారని, రాజ్‌పాకాల ఇంట్లో ఫంక్షన్ విషయంలోనూ అర్ధరాత్రి దాటిన తర్వాత కేటీఆర్ అకడికి వెళ్లారని, ఆయన భార్య పార్టీలో పాల్గొన్నారని ప్రచారం చేశారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి.
లగచర్ల ఉదంతంలో..
ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను అడ్డుకొని అధికారులపై కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులు దాడిచేసిన ఘటనలోనూ కేటీఆర్‌ను ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఏ విషయం వెల్లడించకున్నా ఆ ఉదంతంతో కేటీఆర్‌కు సంబంధం ఉన్నదని పోలీసులతో ప్రభుత్వం కట్టుకథ అల్లింది.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ కేసులో
సంచలనం రేపిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి వ్యవహారంలో కేటీఆర్‌ను ఇరికించాలని సర్కార్ కుట్ర చేసిందన్న ఆరోపణలున్నాయి. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు న్యాయస్థానానికి సమర్పించిన కన్ఫెషన్ రిపోర్ట్‌లో ఏ చిన్న అవకాశం దొరికినా సరే కేటీఆర్ పేరు చేర్చాలని ప్రయత్నించింది. అయితే, అందులో ఎలాంటి ఆధారాలూ దొరక్కపోవడంతో మరో మార్గం కోసం వేచి చూసింది.