హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. బుధవారం ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన గులాబీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విప్లవాత్మక పంథాను అనుసరించిన విధంగానే నేడు దేశ హితం కోసం నూతన రాజకీయ ఒరవడిని సీఎం కేసీఆర్ ప్రారంభించారని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న ప్రజా సంక్షేమ, ప్రగతిశీల విధానాలు బీఆర్ఎస్ వేదికగా దేశం మొత్తానికి పరిచయం అవుతాయని తెలిపారు. దేశంలో రాబోయే గుణాత్మక మార్పుకు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభం నాంది అన్నారు.
ముందు షెడ్యూల్ కారణంగానే
తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి ముందే షెడ్యూల్ నిర్ణయమైన రెండు కీలక సమావేశాల కారణంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రత్యేక అనుమతితో తాను ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభానికి హాజరు కాలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వాహన దిగ్గజ కంపెనీ మారుతీసుజుకీకి చెందిన అంతర్జాతీయ విభాగాల అధిపతులతో బుధవారం సమావేశం అయ్యేందుకు షెడ్యూ ల్ ముందే ఖరారైందని వివరించారు. సుజుకీ కంపెనీతో గత కొంతకాలంగా సంప్రదింపులు కొనసాగుతున్నాయని,సమయపాలన, షెడ్యూలింగ్ వంటి విషయాలకు జపాన్ కంపెనీలు ప్రాధాన్యం ఇస్తాయని తెలిపారు. దీంతోపాటు సలార్పురియా నాలెడ్జ్ పార్కులో బాష్ కార్యాలయ ప్రారంభం, సిరిసిల్లలో సెస్ ఎన్నికల నామినేషన్లు బుధవారమే ఉన్నాయని ఈ నేపథ్యంలోనే తాను ఢిల్లీ వెళ్లలేదని తెలిపారు.