(నమస్తే తెలంగాణ): కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రమాదవశాత్తు మరణించిన 50 మంది కార్యకర్తల కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల ప్రమాద బీమా ఆర్డర్ కాపీలను శనివారం తెలంగాణభవన్‌లో అందజేశారు.
డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ ఇన్సూరెన్స్ విభాగ ఇన్చార్జి సోమా భరత్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, హరిప్రియానాయక్, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేతలు జల్లి సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మరే రాజకీయ పార్టీ సభ్యులకు లేనివిధంగా బీఆర్ఎస్ సభ్యులకు రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించి, వారి కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని తెలిపారు. ప్రజల పట్ల, పేదల పట్ల, పార్టీ సభ్యుల పట్ల పట్టింపు, ప్రేమ ఉన్న గొప్ప నాయకుడు కాబట్టే సీఎం కేసీఆర్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను అక్కున చేర్చుకున్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే హరిప్రియానాయక్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రమాదబీమా సౌకర్యాన్ని కల్పించటం కార్యకర్తల అదృష్టమని చెప్పారు. తొమ్మిదేండ్లలో వేలాది బీఆర్ఎస్ కుటుంబలకు రూ.100 కోట్ల బీమా సొమ్మును చెల్లించినట్టు సోమా భరత్‌కుమార్ తెలిపారు.