హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తేతెలంగాణ): తన 25 ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో ఇంత చెత్త ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో అందినోళ్లు అందినంత దోచుకుంటున్నరు తప్ప ప్రజలకు మాత్రం చేసిందేమీలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, వాళ్ల కుటుంబసభ్యులు భూములు కబ్జా చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హైడ్రా తెచ్చి ఆగం చేస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కోబ్రా పేరుతో చట్టం తెస్తామని, కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తేల్చిచెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో కాంగ్రెస్ నేతల చేరికల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కార్తీక్‌రెడ్డి మాట్లాడారు. రాజేంద్రనగర్, చేవెళ్లలో గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తంచేశారు.
కేసీఆర్ ఆనవాళ్లను ఎవరూ చెరపలేరు: సబిత
రేవంత్‌రెడ్డి లాంటి ఎందరు పాలకులు వచ్చినా కేసీఆర్ ఆనవాళ్లను చెరపలేరని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజానీకం ఆయన నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నదని చెప్పారు. ఏ ఫ్లైఓవర్ చూసినా కేటీఆరే గుర్తుకొస్తారని కొనియాడారు. అన్నింటా చిట్టచివర ఉన్న తెలంగాణను అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌కు దక్కితే..మళ్లీ చిట్టవరికి చేర్చిన గొప్పతనం రేవంత్‌కే దక్కుతుందని ఎద్దేవాచేశారు.