హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒకటీ నెరవేర్చకపోవడంతో రేవంత్‌రెడ్డి సర్కారుపై ప్రజలు కోపంగా ఉన్నారని, బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. తెలంగాణ సమాజం ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నదని, హామీలను విస్మరించిన కాంగ్రెస్‌కు అక్కడ డిపాజిట్ గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణభవన్‌లో బుధవారం నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ మైనార్టీల సమావేశంలో హరీశ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు గుర్తు చేయాలని మైనార్టీలకు సూచించారు. మైనార్టీల సంక్షేమం కోసం కేసీఆర్ కృషి చేసినంత దేశంలో మరే నాయకుడు కూడా చేయలేదని స్పష్టంచేశారు. కేసీఆర్ హయాంలో మైనార్టీలు సంతోషంగా ఉన్నారని, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, మైనార్టీ విద్యాసంస్థలు, అందరికీ ఇంగ్లిష్ మీడియం, విదేశీ విద్య అందించారని, దేశంలో మొదటిసారి ఇమాం, మౌజమ్‌లకు గౌరవ వేతనమిచ్చి గౌరవించారని, రంజాన్ తోఫా ఇచ్చి ముస్లింల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని గుర్తుచేశారు. మైనార్టీ మంత్రికి వారి వర్గం పోర్ట్ ఫోలియో ఏదో ఇచ్చి చేతులు దులుపుకొంటారని, కానీ కేసీఆర్ మాత్రం మైనార్టీ మంత్రికి ప్రాధాన్యం ఉన్న శాఖలను ఇచ్చి గౌరవించుకున్నారని తెలిపారు.
క్యాబినెట్లో మైనార్టీలకు స్థానమేది?
అక్కడ మోదీ క్యాబినెట్లో, ఇక్కడ రేవంత్ క్యాబినెట్లో మైనార్టీలకు స్థానం కల్పించలేదని హరీశ్ విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డి.. నేను బీజేపీ సూల్లో చదువుకున్న.. కాంగ్రెస్‌లో ఉ ద్యోగం చేస్తున్న అని చెప్పి పొద్దుతిరుగుడు పువ్వులా బీజేపీ చుట్టూ తిరుగుతుంటడు. అ లాంటి ముఖ్యమంత్రిని మైనార్టీలు ఎలా నమ్మా లి’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని గుర్తించిన ప్రజలు, మైనార్టీలు మళ్లీ కేసీఆరే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. అందరం కార్యకర్తల్లా కలిసి పనిచేసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేందుకు కృషిచేయాలని విజ్ఞప్తిచేశారు.
గంగా జమున తహజీబ్‌ను కాపాడిన కేసీఆర్ : మహమూద్ అలీకాంగ్రెస్ పార్టీ వల్లే మైనార్టీలు వెనకి నెట్టి వేయబడ్డారని మాజీ మంత్రి మహమూద్ అలీ వాపోయారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కేసీఆర్ వల్లే సాధ్యమైందని స్పష్టంచేశారు. కరెంట్, తాగునీటికి తండ్లాడిన తెలంగాణలో కేసీఆర్ సీఎం అయ్యాకే పరిస్థితి మారిందని గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో మైనార్టీలకు గురుకులాల్లో మంచి విద్య లభించిందని, పేద మైనార్టీల పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారంటే అది కేసీఆర్ అందించిన నాణ్యమైన విద్య ఫలితమేనని చెప్పారు. తెలంగాణలో గంగా జమున తెహజీబ్‌ను కేసీఆర్ కాపాడారని, పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా నిలబెట్టారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 19 నెలల్లో వ్యాపారాలను దెబ్బతీసిందని, మైనార్టీల వద్ద పైసలు లేకుండా చేసిందని విమర్శించారు. గతంలో విదేశీ విద్య ఎంత మంది చదివారో, ఇప్పుడు ఎంత మంది చదువుతున్నారో ఆలోచించాలని సూచించారు.
కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలి: తలసాని
రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని, ప్రజలను ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పిలుపునిచ్చారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగా ణ ఎలా మారిందో, హైదరాబాద్ రూపు రేఖలు ఎలా మారాయో చూశామని చెప్పారు. ప్రత్యేకించి మైనార్టీలకు కేసీఆర్ చేసినంత మేలు ఎవరూ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలే బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఆత్మహత్యకు కారణమని, అందుకు కాంగ్రెస్‌కు ఈ ఉపఎన్నికలో గట్టి సమాధానం ఇవ్వాలని కోరారు. వీధి వ్యాపారులను రేవంత్ సర్కారు ఎలా వేధిస్తున్నదో అర్థం చేసుకోవాలని సూచించారు. ఢిల్లీ నుంచి ఎవరో చెప్పారని ఓట్లు వేయొద్దని, స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని చెప్పారు.
మైనార్టీలను మోసగించిన కాంగ్రెస్: దాసోజు
అన్ని వర్గాలను మోసం చేసినట్టే మైనార్టీల నూ కాంగ్రెస్ మోసగించిందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. మైనార్టీ డిక్లరేషన్‌లో ఏ ఒక హామీ అమలుకు నోచుకోలేదని, పదవుల విషయంలో కూడా అన్యాయం చేసిందని మండిపడ్డారు. హైడ్రా పేరుతో ముస్లిం ఇండ్లను కూల్చివేసిందని విమర్శించారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలో మైనార్టీలకు పథకాలు అమలయ్యాయని గుర్తుచేశారు. సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఫరూక్ హుస్సేన్, సలీం, సోహైల్, అక్బర్ హుస్సేన్, నాయకులు విష్ణువర్ధన్, మన్నె గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డిని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదని సోనియా, రాహుల్, ప్రియాంక లను తీసుకొచ్చి వారితో హామీలు ఇప్పించిండ్రు. ఎన్నికల తర్వాత సోనియా, రాహుల్, ప్రియాంక పత్తాలేకుండా పోయిండ్రు. 1.12 లక్షల మంది పేద మైనార్టీ ఆడబిడ్డలకు కేసీఆర్ షాదీ ముబారక్ అందించిండ్రు. కాంగ్రెస్ అదనంగా తులం బంగారం ఇస్తామని మోసం చేసి అసలు షాదీ ముబారక్ కూడా ఇస్తలేదు. – హరీశ్‌రావు
కాంగ్రెస్ పాలనలో రంజాన్ తోఫా, కేసీఆర్ కిట్టు, ఫీజు రీయింబర్స్మెంట్. ఓవర్సీస్ స్కాలర్షిప్ అన్నీ బందైనయి. సెక్యులర్ అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి సరారు ఒక మైనార్టీ నేతను మంత్రిగా చేయలేదు. రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినా మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో ప్రమాణస్వీకారం చేసిన మరో మంత్రి మహమూద్ అలీ. -హరీశ్‌రావు
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అనేక హామీలు ఇచ్చింది. మైనార్టీ సబ్‌ప్లాన్ ఇస్తం.. మైనార్టీలకు 4000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తం.. ఇమామ్, మౌజమ్‌లకు గౌరవ వేతనం 5000 నుంచి 12 వేలకు పెంచుతం.. ఓవర్సీస్ సాలర్షిప్స్ కేసీఆర్ రూ.20 లక్షలు ఇస్తే మేము 25 లక్షలు ఇస్తమని గొప్పలు చెప్పింది. మరి ఇందులో ఒక హామీ అయినా నెరవేర్చిందా? – హరీశ్‌రావు